పోలీసులకు తలనొప్పిగా మారిన జాయ్ జమీనా కేసు
రెండుసార్లు పోలీసులు కస్టడీకి తీసుకున్నా నోరు విప్పని యువతి
ముఠాలో ఉన్న వారి వివరాల కోసం విశ్వప్రయత్నాలు
వివరాలు గోప్యంగా ఉంచుతున్న పోలీసులు
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసు వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నారా? బీజేపీ యువనేతలకు కూడా ఈ కేసుతో ప్రమేయముందా? వీరూ హనీట్రాప్ బాధితులా? లేదా యువతి ద్వారా వ్యాపారులను దోచుకుంటున్న సూత్రధారులా? ఇప్పుడివే సందేహాలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి.
వ్యాపారులు, బిగ్‌షాట్స్ లక్ష్యంగా జాయ్ జమీనా అనే యువతి వలపు వల విసిరి.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు వ్యాపారులు మాత్రమే ఆమె వలలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ.. ఆ జాబితాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు గుçప్పుమంటున్నాయి. ఈ కేసు వివరాలు బయటకు వెల్లడించకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తుండడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరిస్తోంది.
వలపు వల విసిరి.. రేప్ కేసు పెట్టి..
జాయ్ జమీనా కోసం ఎన్‌ఆర్‌ఐ యువకుడు అమెరికా నుంచి వచ్చి.. ఆమె వలలో చిక్కుకొని రూ.లక్షలు పోగొట్టుకున్నాడని.. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. విచారణలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు విస్తుపోయారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆమె నోరువిప్పనట్లు తెలిసింది.
దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. గతంలో ఈ తరహా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా? అని దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఒక వ్యక్తిపై పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ కేసు వివరాలను ఆరా తీయడంతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఆమెను భీమిలి పోలీస్‌స్టేషన్‌లో విచారించినప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టుకు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇంతలో కంచరపాలెం, ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఆమె ఇద్దరి వ్యాపారులను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందాయి.
స్ప్రే కొట్టి.. ముగ్గులోకి దించి..
జాయ్ జమీనా ట్రాప్‌లో చిక్కుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమె వ్యాపారులను దోచుకున్న తీరుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రెస్టారెంట్, కాఫీషాప్, రాజకీయ నేతలు ఇలా ఆర్థికంగా బలమైన వారినే ఎంచుకుంది. వారిని ఏదో ఒక విధంగా పరిచయం చేసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని, కవ్వింపు మాటలతో ముగ్గులోకి దింపేది. ఒక రోజు వారితో కారులో బయటకు వెళ్లడం.. ఆ సమయంలో వారి ముఖంపై ఒక రసాయనాన్ని స్ప్రే చేయడం.. ఇంటికి తీసుకువెళ్లడం.. వారు వద్దన్నా డ్రింక్ లేదా కాఫీ బలవంతంగా తాగించడం.. ఆ తరువాత బాధితులు మత్తులోకి జారిపోవడం.. లేచి చూసేసరికి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం.. రూ.లక్షలు డిమాండ్ చేయడం.. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించడం.. డబ్బు ఇవ్వని వారిపై రేప్ కేసు పెట్టడం.. ఇదే తరహాలో అనేక మందిని ఆమె దోచుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలతో పాటు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
రెండు సార్లు కస్టడీకి తీసుకున్నా..
జమీనా నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి స్టేషన్‌లో నమోదైన కేసులో ఆమె అరెస్టయింది. కోర్టు ద్వారా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె వెనుక ఉన్న ముఠా సమాచారం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా.. నోరు విప్పడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ల్యాప్‌టాప్, మొబైల్‌లో ఉన్న సమాచారం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సమాచారం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, నచ్చింది చేసుకోమని ఆమె సమాధానమివ్వడంతో పాటు తిరిగి వారినే బెదిరిస్తూ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీ సమయం ముగియడంతో ఆమెను మళ్లీ జైలుకు పంపించారు. అయితే కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కాఫీషాప్ యజమాని ఫిర్యాదుపై నమోదైన కేసులో కూడా గత రెండు రోజుల క్రితం ఆమెను రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆమె నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయతి్నంచారు.
Comments
Please login to add a commentAdd a comment