దేవుడు ముసుగులో దోచేస్తున్నారు | Land Mafia: Govt Land Kabza By Realtors In Vizianagaram | Sakshi
Sakshi News home page

దేవుడు ముసుగులో దోచేస్తున్నారు

Published Tue, Feb 1 2022 11:01 PM | Last Updated on Tue, Feb 1 2022 11:04 PM

Land Mafia: Govt Land Kabza By Realtors In Vizianagaram - Sakshi

పేరు దేవుడిది.. దందా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులది. స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్‌ గీశారు. పచ్చని కొండను జేసీబీలతో ఇష్టారాజ్యంగా చదును చేసేస్తున్నారు. ప్లాట్లుగా మలిచే పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అధికారులు అడ్డుచెప్పినా ఫిరంగి కొండను కైంకర్యం చేసేపనులు సాగిస్తున్నారు. కొత్తవలసలో రెవెన్యూ పరిధిలో దేవుడి ముసుగులో సాగుతున్న భూదందాకు ‘సాక్షి’ అక్షరరూపం.   

సాక్షి ప్రతినిధి, విజయనగరం: కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. అదే ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే ఆ పక్కనే కొంత స్థలంలో దేవుడికో గుడి కట్టాలి. అక్కడ విలువ పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థలాలను హాట్‌కేక్‌ల్లా అమ్మేసుకోవాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను కొత్తవలసలో అక్రమార్కులు పక్కాగా ఫాలో అవుతున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఫిరంగి కొండనే జేసీబీలతో దొలిచేస్తున్నారు.

అక్కడ రేకుల షెడ్‌లో తాత్కాలికంగా దేవుడిని పెట్టారు. అక్కడికి కాస్త ఎగువన కొండపై గుడి నిర్మాణం ప్రారంభించారు. అదే సమయంలో పరిసరాలతో పాటు రోడ్డు వేసే పేరుతో రూ.20 కోట్ల విలువైన దాదాపు ఐదు ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని చదును చేసేశారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి స్వయంగా హెచ్చరించినా అక్రమార్కులు తగ్గలేదు. తహసీల్దార్‌ దేవుపల్లి ప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఆ మార్గంలోని కల్వర్టును ధ్వంసం చేయించారు. వారి ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమార్కులు ఆ పక్కనుంచే రోడ్డు నిర్మాణ పనులు చేసుకుపోతున్నారు.  

స్వామిపేరు చెప్పి భూ కైంకర్యం...  
కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 168లో దాదాపు 415.38 ఎకరాల విస్తీర్ణంలో ఫిరంగికొండ విస్తరించి ఉంది. గతంలో గిరిజన రైతులకు అక్కడ 150 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతోంది. దీంతో కొండపై వేంకటేశ్వర స్వామి గుడికడతాం అంటూ కబ్జాదారులు స్కెచ్‌ వేశారు. దీనికి కొత్తవలస రెవెన్యూ కార్యాయలంలోనే కొంతమంది సిబ్బంది యథాశక్తిగా సాయం అందించారు. దీంతో అర ఎకరంలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవుడికి భారీ ప్రాంగణం ఉండాలని చెబుతూ పరిసరాల్లో దాదాపు 4.5 ఎకరాల వరకూ చదును చేసేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకోవాలనేది అసలు పన్నాగంగా తెలుస్తోంది.  

అనుమతుల్లేకుండా నిర్మాణాలు...  
వాస్తవానికి ఫిరంగికొండ పచ్చదనం పరచుకొని ఉంటుంది. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ రోడ్లు, భవనాల వంటి నిర్మాణాలు చేపడితే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. గుడి నిర్మాణమే అయినా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా గుడి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు వేసేశారు. భారీ ఖర్చుతో కల్వర్టు కూడా నిర్మించారు.  స్వాగతద్వారం ఏర్పాటు చేశారు.  

అధికారుల ఆదేశాలు బేఖాతరు... 
కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి గత డిసెంబర్‌ 17వ తేదీన కొత్తవలస పర్యటనకు వచ్చినపుడు ఫిరంగికొండపై తవ్వకాలను చూశారు. వాటిపై ఆరా తీశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయా? గుడి నిర్మాణం చేయడానికి టీటీడీగానీ, దేవాదాయ శాఖ గానీ అనుమతులు ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ అనుమతులు ఏమైనా ఉన్నాయా? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అలాంటివేమీ లేకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు.  

దర్జాగా నిర్మాణ పనులు... 
ఫిరంగి కొండపై చేస్తున్న పనులు నిలిపేసేందుకు తహసీల్దార్‌ ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది జనవరి 18న కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గంలోనున్న కల్వర్టును జేసేబీతో ధ్వంసం చేయించారు. అక్కడ నిర్మాణ పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. వీటిని అక్రమార్కులు బేఖాతరు చేశారు. కూలిన కల్వర్టు పక్కనే మళ్లీ రోడ్డువేసి పనులు చేస్తున్నారు.  

నీరుగారిన క్రిమినల్‌ కేసు... 
ఫిరంగి కొండను ఆక్రమించి తవ్వకాలు చేసినవారిపై, నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. గత తహసీల్దార్‌ రమణారావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ముగ్గురిపై భూ ఆక్రమణ (ల్యాండ్‌ గ్రాబింగ్‌) కేసు నమోదైంది. వాస్తవానికి అసలు సూత్రధారులను వదిలేసి ఏదో తూతూమంత్రంగానే ఆ ఫిర్యాదు ఉందని ఇటు రెవెన్యూ వర్గాల్లోను, అటు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల పైరవీలతో ఈ కేసు కాస్తా నీరుగారిపోయింది. ఫిరంగి కొండ కాస్త కరిగిపోతోంది.  

ప్రభుత్వ స్థలాలకు ఎసరు... 
కొత్తవలస నుంచి గతంలో గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ జరిగిన రెల్లి–గిరిజాల రోడ్డులో ఫిరంగి కొండ ఉంది. దీనికి దిగువన టీచర్స్‌ కాలనీ, ఎన్‌జీఓ కాలనీ ఉన్నాయి. అక్కడ ఎవరెవరికీ పట్టాలు ఇచ్చారో, ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే రెవెన్యూ రికార్డు కాస్త అక్రమార్కుల చేతికి వచ్చింది. దాని ఆధారంగా వంద గజాలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ధరకు ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు. ఇలా రికార్డు లీకేజీ వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

కల్వర్టును ధ్వంసం చేయించాం.... 
ఫిరంగి కొండ అంతా ప్రభుత్వ స్థలమే. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే ట్రాక్టర్లు, జేసీబీలు కొండపైకి వెళ్లకుండా ఆ మార్గంలో కల్వర్టును ధ్వంసం చేయించాం. ఆ కల్వర్టును నిర్మించినదీ  ఆక్రమణదారులే. దీనిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం.        
– దేవుపల్లి ప్రసాదరావు, తహసీల్దార్, కొత్తవలస  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement