ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో ప్రధాన రహదారికి సమీపంలో విలువైన ప్రభుత్వ స్థలం
జిల్లా కేంద్రంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై ఓ కీలక ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఇంకేం కబ్జాకు శ్రీకారం చుట్టేశారు. పథక రచన చేసి ముప్పై ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రోడ్డును కుదింపు చేశారు. అనుచరులను రంగంలోకి దించి అక్కడ కొంతభాగంలో ఆక్యుపెన్సీలో ఉన్న వారితో చర్చలు జరిపారు. వారున్న 20 శాతం ఆక్యుపెన్సీలో 50 శాతం వాటాకు ఒప్పందం కుదిరింది. మిగతా 80 శాతం ప్రభుత్వ భూమి స్వాధీనానికి ప్రయత్నాల్లో ఉన్నారు.
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఎల్ల మ్మగుట్ట ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని 60 నుంచి 90 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 15 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంది. వాస్తవానికి ఈ భూమి ఇనాం, వక్ఫ్ బోర్డు పేరిట రికార్డులో ఉన్నట్లు సమాచారం. 30 ఏళ్ల కిత్రం ఈ భూమిని ఆర్టీసీ డిపో–2 కోసం అప్పటి తహసీల్దారు కేటాయించారు. అయితే కొందరు ఆ సర్వే నంబర్లలో తమ భూమి ఉందంటూ కోర్టుకు వెళ్లా రు.
దీంతో ఆర్టీసీ డిపో–2కు న్యాల్‌కల్ రోడ్‌లో మరోచోట భూమిని కేటాయించారు. ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డు వస్తుందని అప్పటి మాస్టర్‌ప్లాన్ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఆ సర్వే నంబర్లలో తమకు ఉన్న కొద్ది భూమిలో 100 అడుగుల రోడ్డు వేస్తే మిగిలే భూమి నామమాత్రమేనని, కోర్టుకు వెళ్లిన వ్యక్తులు తర్వాత పట్టించుకోకుండా ఉండిపోయారు. ఈ భూమికి అప్పట్లో పెద్దగా విలువ లేకపోవడంతో అంతగా దృష్టి పెట్టలేదు. కోర్టుకు వెళ్లిన వారికి సర్వే నంబర్లలోని 20 శాతం భూమికి సంబంధించి ఇటీవలే క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. మిగిలిన 80 శాతం ప్రభుత్వ భూమి. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుంది.
బయటకు పొక్కిందిలా..
మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి 25 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్‌ప్లాన్ మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ భూమిపై కన్నేసిన కీలక ప్రజాప్రతినిధి ఈ భూమి కోసం ప్రణాళికలు రచించారు. ఇక్కడ ప్రభుత్వ భూమితో పాటు కొంతమంది ఎల్లమ్మగుట్టకు చెందినవారి భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పట్టాదారులెవరూ లేరని, ఎల్లమ్మగుట్టకు చెందిన కొందరు కబ్జాలో ఉన్నట్లు తెలిసింది. అయితే 100 అడుగుల రోడ్డు రద్దు అయ్యిందని, 40 అడుగుల రోడ్డు వేయిస్తున్నామని మీ భూమిని మాకు ఇవ్వాలంటూ రహస్యంగా తన అనుచరుల ద్వారా కబ్జాలోని వ్యక్తులతో సంప్రదింపులు జరిపారు.
అవసరమైతే భూమిని డెవలప్ చేసి ఫిఫ్టీ–ఫిఫ్టీ ప్రాతిపదికన (200 గజాలు ఉంటే 100 గజాలు ఇచ్చేలా) ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిదే ఈ తతంగం నడిపించడంతో సదరు వ్యక్తులు భయపడి ఆఫర్‌కు అంగీకరించినట్లు సమాచారం. అయితే మిగిలిన 80 శాతం ప్రభుత్వ భూమికి ఏవిధంగా రికార్డులు సృష్టించారో తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులను నయానో, భయానో ఒప్పించి ఈ తతంగం నడిపిస్తున్నట్లు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
చదవండి: పుట్టుకతోనే మూగ, చెవుడు.. అవేవి అతన్ని ఆపలేకపోయాయి
Comments
Please login to add a commentAdd a comment