పున్నమి గెస్ట్‌హౌస్
సెంటు స్థలం లేని పేదలు ఆవాసం కోసం వృథాగా ఉన్న భూముల్లో గుడిసెలు వేసుకుంటే అది అక్రమం..వెంటనే పోలీసులు వాలిపోతారు..రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి స్థలాలను ఖాళీ చేయిస్తారు. కాళ్లకు మొక్కినా కనికరించరు. అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే..తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ప్రభుత్వ స్థలం తక్కువ ధరకు లీజుకు దొరుకుతుంది. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 99 ఏళ్లు ఆ భూమిని స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఆర్థికంగా ఎదగనూ వచ్చు. ఇందుకు ఏ నిబంధనలు అడ్డురావు. పైగా మంత్రి బంధువుగా ఉంటే వ్యవహారాన్ని అడ్డులేకుండా చక్కబెట్టుకోవచ్చు. కర్నూలు నగరంలో ఇలానే జరుగుతోంది. విలువైన పర్యాటక స్థలాన్ని కాజేయడానికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చురుగ్గా పావులు కదుపుతుండడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు ; అధికారపార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను పర్యాటక శాఖ స్థలంపై పడింది. ఇప్పటికే ఆయన.. భారీగా క్రైస్తవ ఆస్తులను లీజు పద్ధతిలో తీసుకున్నారు. అదే పద్ధతిలో పర్యాటక శాఖ స్థలాలను కైవసం చేసుకోవాలని యత్నిస్తున్నారు. కోడలు భూమా అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా ఉండడంతో వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఏకంగా 99 ఏళ్ల పాటు నామమాత్రపు లీజుకు ఎకరన్నర స్థలాన్ని తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న పర్యాటకశాఖ స్థలాన్ని లీజు ప్రాతిపదికన తీసుకుని భారీ షాపింగ్ మాల్స్ ఏర్పాటు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే, ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే చేజిక్కించుకోవాలనేది ఆలోచనగా ఉంది.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితులల్లో టెండర్లను పిలిచినప్పటికీ ఎవరూ అడ్డురాకుండా చేసుకునేలా ఆయన అనుచరులు బెదిరింపులకు కూడా దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు స్థలం వద్దకు ఎమ్మెల్యే అనుచరులు రాకపోకలు సాగిస్తూ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీలోని టెండర్ల వ్యవహారంలో ఏకచక్రాధిప్యతంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు పర్యాటకశాఖ స్థలంపై పడడం చర్చనీయాంశమైంది.
ఎవరూ పోటీలో లేకుండా...!
కర్నూలులో వెంకటరమణ కాలనీకి మంచి గుర్తింపు ఉంది. పర్యాటక శాఖకు ఇక్కడ సుమారు 5 ఎకరాల వరకు స్థలం ఉంది. ఇందులో క్యాంటీన్, లాడ్జింగ్‌తో పాటు బారు కూడా పర్యాటకశాఖకు ఉంది. అదేవిధంగా ఒక ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నారు. ఇంకా రెండు ఎకరాల వరకూ ఖాళీ స్థలం ఉంది. ఇందులో ఎకరన్నర స్థలంపై ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి కన్ను పడింది. ఈ స్థలాన్ని తక్కువ ధర లీజుకే కాజేయాలనేది ఆయన యత్నంగా ఉంది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖకు చెందిన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే టెండర్లను పిలవడం పరిపాటి. అక్కడ ఏమి ఏర్పాటు చేయాలనే విషయాన్ని సదరు శాఖనే నిర్ణయిస్తుంది. అయితే, కర్నూలులోని వెంకటరమణ కాలనీలోని పర్యాటకశాఖ స్థలం విషయంలో మాత్రం ఇప్పటివరకు పర్యాటకశాఖ టెండర్‌ను పిలవలేదు. ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండానే లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒకవేళ టెండర్ అనివార్యమైతే... ఎవరు టెండర్‌లో పాల్గొనకుండా చూసుకోవాలనేది కూడా ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరులు రెండు, మూడు రోజులకోసారి పర్యాటకశాఖ స్థలం వద్దకు వెళ్లి చక్కర్లు కొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులే వాపోతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పనుల్లో ఏ చిన్న కాంట్రాక్టర్ బరిలో ఉండకుండా ఎమ్మెల్యే తన మనుషులకే టెండర్లను కట్టబెడుతున్నారు. అదీ అంచనా వ్యయాన్ని పెంచి పనులు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోడలు మంత్రి అఖిప్రియ చూస్తున్న పర్యాటక శాఖపై కన్నేశారు. లీజు పద్ధతిలో పర్యాటక స్థలాన్ని చేజిక్కించుకునేందుకు యత్నించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment