భూసర్వే వేగంగా పూర్తి చేయాలి | Land survey should be completed Fast | Sakshi
Sakshi News home page

భూసర్వే వేగంగా పూర్తి చేయాలి

Published Tue, Mar 15 2022 3:55 AM | Last Updated on Tue, Mar 15 2022 3:45 PM

Land survey should be completed Fast - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంలో భాగంగా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. డ్రోన్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఎక్కువ డ్రోన్‌లను వినియోగించి లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని ఆదేశించింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమీక్ష నిర్వహించింది.

అటవీ భూముల సరిహద్దులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించడంతో పాటు పట్టణ ప్రాంతాల సర్వేలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,277 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే మ్యాప్‌ల కోసం చిత్రాలు తీసే ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు సబ్‌కమిటీకి వివరించారు. 6,843.81 చదరపు కిలోమీటర్ల మేర 51 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేశామన్నారు. భూవివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే మొబైల్‌ మేజిస్ట్రేట్‌లకు శిక్షణ పూర్తయిందని, అర్బన్‌ ఏరియాల్లో అధికారులకు పది రోజుల శిక్షణ ప్రారంభించామన్నారు. త్వరలోనే వార్డు, ప్లానింగ్‌ సెక్రటరీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు.

ఓటీఎస్‌పై చైతన్యం కలిగించాలి
ప్రజల్లో ఓటీఎస్‌పై చైతన్యం కలిగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో భాగంగా అధికారులకు మంత్రులు సూచించారు. ఇప్పటి వరకు పది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని, 4.97 లక్షల మందికి డాక్యుమెంట్లు కూడా రిజిస్టర్‌ చేసినట్టు అధికారులు వివరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి 2.83 లక్షల మంది డాక్యుమెంట్లకు అనుమతులు లభించాయన్నారు. సమీక్షలో సీసీఎల్‌ఏ కమిషనర్‌ జి.సాయిప్రసాద్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (మున్సిపల్‌) శ్రీలక్ష్మి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (హౌసింగ్‌) అజయ్‌ జైన్, సర్వే అండ్‌ సెటిల్‌ మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ్‌ భరత్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement