
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరిన 31 ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేసింది. వేలాది కోట్ల రూపాయల ఈ ఒప్పందం పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. కేంద్రం అత్యధిక ధరకి ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం విలేకరుల సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ డ్రోన్ల ఒప్పందంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.
‘‘దేశభద్రతను ప్రమాదంలో పడేయడం మోదీ ప్రభుత్వానికి సర్వసాధారణం. రఫేల్ ఒప్పందంలో కూడా ఇదే చూశాము. 126 రఫేల్ యుద్ధ విమానాలకు బదులుగా మోదీ ప్రభుత్వం 36 మాత్రమే కొనుగోలు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపుని కూడా హెచ్‌ఎఎల్‌కు నిరాకరించడమూ మనం చూశాం. డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ, త్రివిధ బలగాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పికీ ఏకపక్ష నిర్ణయాలు ఎన్నో జరిగాయి. ఇప్పటికీ రఫేల్ కుంభకోణంపై ఫ్రాన్స్ పరిశీలనలో ఉంది’’ అని పవన్ ఆరోపించారు. మరో రక్షణ స్కామ్‌లో మనం పడకూడదన్నారు.
ఎందుకంత ధర?
అమెరికాలో జనరల్ ఆటమిక్స్ సంస్థ రీపర్ డ్రోన్ల ఒక్కొక్కటి రూ.812 కోట్లకు విక్రయిస్తోందని, భారత్ 31 డ్రోన్లకు ఒప్పందం కుదుర్చుకుందని అంటే మొత్తంగా 25,200 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని పవన్ అన్నారు. ఇప్పుడు పెడుతున్న దాంట్లో 10–20 శాతం ఖర్చుతో డీఆర్‌డీఒకి డ్రోన్లను అభివృద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. మరెందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డ్రోన్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. 2017లో ఈ డ్రోన్లను తొలుత తయారు చేశారని, ఇప్పుడు సాంకేతికత బాగా పెరిగిందని లేటెస్ట్ టెక్నాలజీ ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పవన్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment