Predator drone deal
-
మరో రఫేల్ అవుతుందా ?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరిన 31 ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేసింది. వేలాది కోట్ల రూపాయల ఈ ఒప్పందం పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. కేంద్రం అత్యధిక ధరకి ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం విలేకరుల సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ డ్రోన్ల ఒప్పందంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ‘‘దేశభద్రతను ప్రమాదంలో పడేయడం మోదీ ప్రభుత్వానికి సర్వసాధారణం. రఫేల్ ఒప్పందంలో కూడా ఇదే చూశాము. 126 రఫేల్ యుద్ధ విమానాలకు బదులుగా మోదీ ప్రభుత్వం 36 మాత్రమే కొనుగోలు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపుని కూడా హెచ్ఎఎల్కు నిరాకరించడమూ మనం చూశాం. డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ, త్రివిధ బలగాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పికీ ఏకపక్ష నిర్ణయాలు ఎన్నో జరిగాయి. ఇప్పటికీ రఫేల్ కుంభకోణంపై ఫ్రాన్స్ పరిశీలనలో ఉంది’’ అని పవన్ ఆరోపించారు. మరో రక్షణ స్కామ్‌లో మనం పడకూడదన్నారు. ఎందుకంత ధర? అమెరికాలో జనరల్ ఆటమిక్స్ సంస్థ రీపర్ డ్రోన్ల ఒక్కొక్కటి రూ.812 కోట్లకు విక్రయిస్తోందని, భారత్ 31 డ్రోన్లకు ఒప్పందం కుదుర్చుకుందని అంటే మొత్తంగా 25,200 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని పవన్ అన్నారు. ఇప్పుడు పెడుతున్న దాంట్లో 10–20 శాతం ఖర్చుతో డీఆర్డీఒకి డ్రోన్లను అభివృద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. మరెందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డ్రోన్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. 2017లో ఈ డ్రోన్లను తొలుత తయారు చేశారని, ఇప్పుడు సాంకేతికత బాగా పెరిగిందని లేటెస్ట్ టెక్నాలజీ ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పవన్ నిలదీశారు. -
Predator drone deal: అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 30 ఎంక్యూ–9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూమహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ ఆధునిక వెర్షనే ఎంక్యూ–9బీ. గత నెలలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా నేత అల్ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌నే కావడం గమనార్హం. జనరల్ ఆటమిక్స్ అభివృద్ధి చేసిన ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయన్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశాయి. వీటి ఖరీదు,, ఆయుధాల ప్యాకేజీ, సాంకేతికత భాగస్వామ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని జనరల్ ఆటమిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ వివేక్ లాల్ కూడా ధ్రువీకరించారు. చర్చల వివరాలను రెండు దేశాల ప్రభుత్వాలే వెల్లడిస్తాయన్నారు. ఎంక్యూ–9బీ గార్డియన్ రకం రెండు డ్రోన్లను 2020 నుంచి భారత్ తమ నుంచి లీజుకు తీసుకుని భూ సరిహద్దులు, హిందూ మహాసముద్రంపై నిఘాకు వినియోగిస్తోందన్నారు. ఈ హంటర్–కిల్లర్ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలవు. -
ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత్..!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాం ముగిసిపోయేలోగా అగ్రరాజ్యంతో అనుకున్న ఒప్పందాలన్నింటినీ త్వరత్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే తరహాలో సైనిక నిఘాకు ఉద్దేశించిన ప్రిడేటర్ డ్రోన్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతోపాటు పలు రక్షణ, అణు ప్రాజెక్టుల ఒప్పందాలు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్స్‌ను తమకు అమ్మాలని భారత్ గత జూన్‌లో అమెరికాను కోరింది. ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుతం సంప్రదింపులు పురోగతి సాధించాయని, ఒబామా పదవిలోంచి దిగిపోయేలోగా ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయ్యే అవకాశముందని భారత అధికార వర్గాలు తెలుపుతున్నాయి. రానున్న కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మారిన మోదీ వ్యూహం! భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఒబామా కూడా అమెరికా విదేశీ దౌత్యవ్యూహంలో ఘననీయమైన మార్పును తీసుకొచ్చి.. మధ్యప్రాచ్యం నుంచి ఆసియా మీదకు దృష్టి కేంద్రీకరించారు. భారత్‌కు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్న రష్యాను భారత్ పక్కనపెట్టేలా అమెరికా ఒప్పించగలిగింది. ఇందుకు ప్రతిగా భారత్‌కు అత్యున్నత సైనిక సాంకేతికత అందించడంతోపాటు బిలియన్ డాలర్లు విలువ చేసే అణురియాక్టర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాకుండా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్‌లో భారత్‌కు స్వభ్యత్వం వచ్చేలా చూసింది. దీంతో భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్లు అమ్మేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కోసం అమెరికా రక్షణమంత్రి అష్టన్ కార్టర్ ఈ ఏడాది చివర్లో భారత్‌కు వచ్చే అవకాశముంది. భయపెడుతున్న ట్రంప్ 'అమెరికా ఫస్ట్' అమెరికా ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన విదేశీ విధానంలో 'అమెరికా ఫస్ట్' అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు. ఆయన ప్రకటనలు ఇటు భారత్‌లోనూ, అటు ఆసియాలోనూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఆసియాకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఒబామా వ్యూహం నుంచి ట్రంప్ తప్పుకోవచ్చునని వినిపిస్తోంది. ట్రంప్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా మిత్రదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌కు ఇస్తున్న రక్షణ సహకారంపై సందేహాలు రేకెత్తించారు. వారికి నేరుగా ఆయుధసాయం చేయడం కంటే.. సొంతంగా అవే అణ్వాయుధాలు రూపొందించుకునేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా విధానంలో ఆసియాకు ప్రాధాన్యం తగ్గొచ్చునని, ఇది పరోక్షంగా ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.