విధివిధానాల ప్రతిపాదనలపై చర్చించిన ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం
గ్రామాల్లో రూ. లక్షన్నర వార్షికాదాయం లేదా మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు
పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల వార్షికాదాయ పరిమితి విధించాలని ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వార్షికాదాయం ఆధారంగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామాల్లో నివసించే కుటుంబాలకు వార్షికాదాయం రూ. లక్షన్నర లేదా మాగాణి (తరి) 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలలోపు ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చినట్లు కొత్త రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం స్పష్టం చేసింది.
పట్టణ ప్రాంతాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయ పరిమితి రూ. 2 లక్షలుగా ప్రతిపాదించినట్లు తెలిపింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.ఎస్. చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.
సక్సేనా కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకుంటాం: ఉత్తమ్
సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విషయంలో సలహాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
తక్షణమే రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధివి«ధానాల రూపకల్పనలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిషనర్‌గా, సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల జారీలో అధికారుల బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీలో అవలంబిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి ఒకేచోట కార్డు ఉండేలా ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉపసంఘం చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త తెల్ల రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment