సాలూరు: తన పాలనలో పార్టీల కతీతంగా, అర్హతే ప్రామాణింగా, అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో చారిత్రక నిర్ణయానికి తెరతీశారు.
ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే నూతన కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు.
కార్యక్రమం విధివిధానాలు
ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యుటేషన్‌లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేషన్, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్‌లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు. ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు.
కార్యాచరణ ఇలా
ప్రతి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్‌లు ఒక టీమ్‌గా, తహసీల్దార్, ఈఓపీఆర్‌డీ/మరో టీమ్‌గా ఏర్పాటవుతారు. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అర్హులెవరైనా ఏవైనా సాంకేతిక, ఇతర కారణాల వల్ల పథకాలు పొందలేకపోతే వారిని గుర్తించి పథకాలు అందేలా చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రధాన సర్టిఫికెట్లు సత్వరమే ప్రజలకు అందించనున్నాం.
– పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి
Comments
Please login to add a commentAdd a comment