శంషాబాద్ రూరల్: వచ్చే 25 ఏళ్లలో భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చిన్నగోల్కొండలో జెండా ఊపి సంకల్ప రథాన్ని ప్రారంభించారు. దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా.. అర్హులైన వారి చెంతకు పథకాలను ఈ రథం ద్వారా తీసుకెళ్తామని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని, ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభించిన యాత్రను జనవరి 25 వరకు కొనసాగిస్తామని, రథాన్ని ప్రతి ఊరుకు తీసుకువెళ్లి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అలాగే అర్హులకు పథకాల మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు.
మోదీ పాలనలో గత 9 ఏళ్లలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, మహిళా సంఘాలకు రుణాలు, పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య చికిత్స, రైతులకు పెట్టుబడి సాయం, గూడు లేని పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, గ్యాస్ కనెక్షన్లవంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతి గ్రామానికి డ్రోన్ మంజూరు..
రైతులు పంటలకు మందులు పిచికారీ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక మహిళా సంఘానికి డ్రోన్ సౌకర్యం సమకూర్చుతున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 15 వేల డ్రోన్‌లను ఇవ్వనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment