Andhra Pradesh: 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు | Laptops For 6.53 Lakh Students Government of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

Published Thu, Oct 28 2021 1:06 PM | Last Updated on Fri, Oct 29 2021 2:16 PM

Laptops For 6.53 Lakh Students Government of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆన్‌లైన్‌ అభ్యసనం కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్లపై జ్యుడీషియల్‌ ప్రివ్యూ పరిశీలన కూడా పూర్తయ్యింది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది. 

తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని 6.53 లక్షల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. 2021–22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న 6,53,144 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏపీటీఎస్‌కు నోడల్‌ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. జగనన్న అమ్మఒడి కింద 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 5,42,365 బేసిక్‌ వెర్షన్‌ ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. ఇక ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఇస్తారు. వీరికోసం ఒక రకం కాన్ఫిగరేషన్‌తో 19,853 ల్యాప్‌టాప్‌లను, వేరే కాన్ఫిగరేషన్‌తో మరో 90,926 ల్యాప్‌టాప్‌లను అందిస్తారు. 

చదవండి: (తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్‌’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..)

బ్రాండెడ్‌ కంపెనీల ల్యాప్‌టాప్‌లు
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్‌ ఇచ్చారు. ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ల్యాప్‌టాప్‌ల్లో సమస్యలు వస్తే కంపెనీలు వారంలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందించాలి. లెనోవో, హెచ్‌పీ, డెల్, ఏసర్‌ వంటి బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది.

హైస్కూల్‌ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు..
4జీబీ రామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్డీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్‌ వర్డ్, పవర్‌ పాయింట్‌) కాన్ఫిగరేషన్‌లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు.

గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు
9వ తరగతి నుంచే ల్యాప్‌టాప్‌లు అందించడం వల్ల విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా పొందొచ్చు. ప్రపంచ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో మేలు. 
– ఇమంది పైడిరాజు, హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్, అడవివరం, విశాఖపట్నం జిల్లా

కరోనా వంటి సమయాల్లో చదువులకు ఇబ్బంది ఉండదు
కరోనా సమయంలో స్కూళ్లు ఆన్‌లైన్‌ పాఠాలను అందించినా ల్యాప్‌టాప్‌లు లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పుతాయి. 
– వి.సునీత, పేరెంట్, జెడ్పీ హైస్కూల్, చంద్రంపాలెం, చినగదిలి, విశాఖపట్నం జిల్లా

డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి వస్తాయి
ల్యాప్‌టాప్‌ల వల్ల మాకు డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్‌లో పాఠాలను అందించినప్పుడు ఫోన్లలో కంటే ల్యాప్‌టాప్‌లే అనువుగా ఉంటాయి.
– సీహెచ్‌ జ్యోత్స్న, జెడ్పీహెచ్‌ఎస్‌ అనంతవరం 

డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు..
మోడల్‌–1..
ప్రాసెసర్‌: ఇంటెల్‌ పెంటియమ్‌ సిల్వర్‌ సిరీస్, ఏఏండీ అథ్లాన్‌ (3000 సిరీస్‌) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్‌ రామ్‌
500 జీబీ హార్డ్‌ డ్రైవ్‌
14 అంగుళాల హై–డెఫ్‌ డిస్‌ప్లే (1366  గీ 768)
వై–ఫై, బ్లూటూత్‌ 
వెబ్‌క్యామ్‌ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)
విండోస్‌ 10 ఓఎస్‌ 
ఆఫీస్‌ 365 స్టూడెంట్‌ ప్యాక్‌
మూడేళ్ల వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్‌ రక్షణ) 
ఎండీఎం సాఫ్ట్‌వేర్‌
బ్యాక్‌ప్యాక్‌/క్యారీ బ్యాగ్‌

మోడల్‌–2..
ప్రాసెసర్‌: ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఏఏండీ రైజెన్‌ 3 (3250) లేదా సమానమైనది.
8 జీబీ డీడీఆర్‌ ర్యామ్‌
500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్‌ డ్రైవ్‌
14 అంగుళాల హై–డెఫ్‌ డిస్‌ప్లే (1366  గీ 768)
వై–ఫై, బ్లూటూత్‌ 
వెబ్‌క్యామ్‌ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)
విండోస్‌10 ఓఎస్‌ 
ఆఫీస్‌ 365 స్టూడెంట్‌ ప్యాక్‌ 
మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్‌ రక్షణ)
ఎండీఎం సాఫ్ట్‌వేర్‌
బ్యాక్‌ప్యాక్‌/క్యారీ బ్యాగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement