శ్రీకృష్ణపై దాడి చేస్తున్న బాలిక బంధువులు (నిందితుడు చేతికి గడియారం పెట్టుకున్న వ్యక్తి)
సాక్షి, పెడన: పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ విద్యార్థినిని వికృత చేష్టలు, మాటలతో లైంగిక వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లి, బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన పల్లపాటి శ్రీకృష్ణ(47) పెడన పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాల లో ఏడో తరగతి చదువుతున్న బాలిక హైస్కూల్లో జరిగే గ్రంథాలయ తరగతులకు హాజరయ్యేది.
గత రెండు రోజులుగా ఇంటి వద్ద ఏడుస్తూ ఉండటం గమనించిన తల్లి ఆరా తీయడంతో బాలిక పాఠశాలలో శ్రీకృష్ణ తనను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి దుర్గాంబిక తన బంధువులతో కలసి సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం గోపాలరావును నిలదీశారు. ఆయన శ్రీకృష్ణను పిలిచి విచారిస్తున్న సమయంలో బాలిక బంధువులు అకస్మాత్తుగా శ్రీకృష్ణపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పెడన ఎస్‌ఐ రవిచంద్ర పాఠశాలకు వెళ్లి శ్రీకృష్ణను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లి దుర్గాంబిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి జోగి రమేష్
బాలిక కుటుంబానికి మంత్రి పరామర్శ
ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సోమవారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలతో వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, సంబంధిత శాఖాధికారులు కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలిక తల్లికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
లైబ్రరీ అసిస్టెంట్‌పై చర్యలకు సిఫార్సు
మచిలీపట్నం: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన పెడన జెడ్పీ స్కూల్ ల్రైబరీ అసిస్టెంట్ పల్లపాటి శ్రీకృష్ణపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినట్లు కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదుపై డెప్యూటీ డీఈవోతో విచారణ జరిపించామన్నారు. శ్రీకృష్ణపై సర్వీసుపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా జెడ్పీ సీఈవోకు విచారణ నివేదికను పంపించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment