AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్‌ | Line Clear For E Buses In APSRTC | Sakshi
Sakshi News home page

AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్‌

Published Sat, Oct 30 2021 10:38 AM | Last Updated on Sat, Oct 30 2021 4:04 PM

Line Clear For E Buses In APSRTC - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీలో తొలిసారిగా 100 ఎలక్ట్రిక్‌ బస్సులు (ఇ–బస్సులు) ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. తిరుమల, తిరుపతిలలో ఈ 100 ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఇటీవల టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అందుకు రాయితీ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతిలలో మొత్తం 250 ఇ–బస్సులను అద్దె విధానంలో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టెండర్లు పిలిచింది.

ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అద్దె డీజిల్‌ బస్సుల రేట్లకు మించకుండా ఇ–బస్సులకు టెండర్లను ఆమోదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ విశాఖపట్నం, విజయవాడ, కాకినాడలలో సర్వీసులకు పలు సంస్థలు డీజిల్‌ బస్సు ధరల కంటే చాలా అధికంగా కోట్‌ చేశాయి. దీంతో ప్రస్తుతానికి ఆ నగరాల్లో ఇ–బస్సు సర్వీసుల అంశాన్ని వాయిదా వేశారు. తిరుమల, తిరుపతిలలో సర్వీసులకు కూడా డీజిల్‌ బస్సుల ధరలకంటే అశోక్‌ లేల్యాండ్, ఈవే ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాస్త ఎక్కువగా కోట్‌ చేయడంతో ఆర్టీసీ ఆ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. చివరకు డీజిల్‌ బస్సుల ధరలకే ఎల్‌–1గా నిలిచిన ఈవే ట్రాన్స్‌ లిమిటెడ్‌కు తిరుమల–తిరుపతిలలో 100 బస్సులకు టెండరును ఖరారు చేసింది. 

త్వరలో సీఎంతో ప్రారంభోత్సవం
100 ఇ–బస్సుల్లో తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో 50 బస్సులు, తిరుపతి నుంచి కడప, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటలకు మరో 50 బస్సు సర్వీసులను ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈవే ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆర్టీసీ త్వరలో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వనుంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తిరుమల, తిరుపతిలలో ఇ–బస్సు సర్వీసులకు ప్రారంభోత్సవం చేయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. తదుపరి దశలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలలో కూడా ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement