Linke Hofmann Busch Compartments Importance And Significance Visakhapatnam - Sakshi
Sakshi News home page

LHB coaches: ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి?

Published Mon, Dec 6 2021 12:51 PM | Last Updated on Mon, Dec 6 2021 1:07 PM

Linke Hofmann Busch Compartments Importance And Significance Visakhapatnam - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఇటీవల కాలంలో రైల్వేలలో తరచుగా వినబడుతున్న మాట ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు (బోగీలు). ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రస్తుతం పలు రైళ్లకు వినియోగిస్తున్నారు. క్రమక్రమంగా అన్ని పాత కోచ్‌లను తొలగించి వాటి స్థానంలో ఈ అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అన్ని రైళ్లకు జతచేయాలనేది రైల్వే ప్రతిపాదన. సాధారణ కోచ్‌లు నీలి రంగులో ఉండేవి. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎరుపు రంగులో ఉంటున్నాయి. ఇవి కాకుండా క్రీం, బ్రౌన్‌ కలర్‌లో కూడా కొన్ని కోచ్‌లను మనం చూస్తుంటాం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? పాత కోచ్‌లకు ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు తేడాలేంటి తెలుసుకుందాం.  

ఎక్కువ వేగం..
ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తక్కువ బరువు ఉండడంతో గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటీకి ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణించే విధంగా నడుపుతున్నారు. ఇవే పాత కోచ్‌లైతే కేవలం గంటకు110 కి.మీ గరిష్ట వేగంతో మాత్రమే నడిచేవి.

ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం 
సాధారణ కోచ్‌ల కంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు సుమారు 1.25 మీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉండడం వలన ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటాయి.  సాధారణ జనరల్‌ కోచ్‌లో 90 సీట్లుంటే అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లో 100 సీట్లు ఉంటాయి. సాధారణ స్లీపర్‌ కోచ్‌లో కేవలం 72సీట్లు /బెర్తులు ఉంటే అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 80 సీట్లు/ బెర్తులు ఉంటాయి.  

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే..
లింక్‌ హోఫ్‌మన్‌ బుష్‌కు సంక్షిప్త పదమే ఎల్‌హెచ్‌బీ. ఈ ఎల్‌హెచ్‌బీ అనేది జర్మన్‌ టెక్నాలజీ తయారీదారు పేరు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల రైళ్లకు ఉపయోగించే కోచ్‌లను ఇటీవల కాలంలో ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో ఇండియాలోనే రైల్‌ కోచ్‌ ప్యాక్టరీ కపుర్తలా, ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ చెన్నై, మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ రాయ్‌బరేలిలలో తయారు చేస్తున్నారు. ఈ కోచ్‌లు మనదేశంలో సుమారుగా 2000 సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రారంభంలో 24 ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంది.

ఈ కోచ్‌లను మొదటగా న్యూ ఢిల్లీ–లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ప్రవేశపెట్టారు. అనంతరం టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతి ద్వారా మనదేశంలో కపుర్తలాలోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వీటి తయారీని ప్రారంభించారు. మన దేశంలో మొదట తయారైన కోచ్‌లు 2005 నుంచి అందుబాటులోకి వచ్చాయి. క్రమేపీ వీటిని చెన్నైలో, రాయ్‌బరేలీలో కూడా తయారు చేస్తున్నారు. ఈకోచ్‌లు యాంటీ టెలిస్కోపిక్‌ కావడం వలన ఏదైనా ప్రమాదాలు సంభవించినపుడు ఇవి ఒక దానిపై ఒకటి పడవు. దీనికోసం ఈ కోచ్‌లలో సెంటర్‌ బఫర్‌ కప్లింగ్‌ సిస్టంను వాడతారు. పాత కోచ్‌లలో అయితే డ్యూయల్‌ బఫర్‌ సిస్టంను వాడేవారు. 

ఆధునిక వసతులు... 
ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు  కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తాయి. 
 సురక్షితమైనవి, మరింత సౌకర్యవంతమైనవి 
► పాత కోచ్‌లతో పోలిస్తే ఇవి తక్కువ బరువు ఉంటాయి. 
► మంచి డిజైన్‌లతో, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో వీటిని తయారుచేయడం వలన ఇవి తుప్పుపట్టడానికి ఆస్కారం తక్కువ 
► తక్కువ నిర్వహణ ఒక మిలియన్‌ కిమీ తరువాత మాత్రమే అవసరమైన సిస్టంలు (రీప్లేస్‌మెంట్, రిమూవల్‌ )మార్చుతారు. 
► కోచ్‌ లోపల ఉన్నతమైన మోడరన్‌ ప్యానల్స్‌ను వినియోగించి రూఫ్, ఫ్లోర్‌లకు ఇంటీరియర్‌లు అమర్చారు. నిర్వహణ సమయాలలో వీటిని సులువుగా తీసుకుని, మళ్లీ పెట్టుకోవచ్చు.  

వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో ..
వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో విశాఖపట్నం నుంచి బయలుదేరు, విశాఖపట్నంలో నిలిచిపోయే రైళ్లు ప్రస్తుతం 37 జతల వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ సుమారు 6 జతల రైళ్లకు (15 రేక్‌లకు) పూర్తిగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను మార్చారు. మిగిలిన వాటికి కూడా అంచెలంచెలుగా మార్పు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. 

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే విశాఖ రైళ్లు 
► విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌ 
► విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ 
► విశాఖపట్నం–కడప–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్‌  
► విశాఖపట్నం–నాందేడ్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌  
►  విశాఖపట్నం–కిరండూల్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ 
► విశాఖపట్నం–అమృత్‌సర్‌–విశాఖపట్నం హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement