శ్రీశైలం టెంపుల్: ఇలకైలాసమైన శ్రీశైలం శ్రీగిరిపై వేంచేసి ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీగిరికి ప్రత్యేక స్థానం. ఇక్కడ మల్లన్నకు జరిగే విశిష్ట సేవలు మరెక్కడా జరగవు. వాటిలో మల్లన్న పాగాలంకరణ ఒకటి. మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో జరిగే ఈ సేవ అత్యంత విశిష్టమైనది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్నకు తలపాగాను తయారు చేస్తుంది. ఆ గ్రామానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు వెంకట సుబ్బారావు తండ్రికి సహకరిస్తున్నారు. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్ వెలుగులు నింపుతారు. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. అనంతరం రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు
శ్రీగిరిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ‘శంభో.. శివ శంభో’అని స్వామివారిని కీర్తిస్తూ శ్రీగిరి చేరుకుంటున్నారు. పలువురు శివమాలను ధరించి వస్తున్నారు. నల్లమల కొండల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది మంది శ్రీగిరికి చేరుకుంటున్నారు.
గజ వాహనంపై మల్లన్న దరహాసం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించాడు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి క్షేత్రప్రధాన వీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవానికి తరలించారు. కళాకారుల కోలాహలం నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు
శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఏ లోటు రానివ్వకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తున్నాం. భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనాన్ని కల్పించాం. క్యూలో వేచి ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం.
– ఎస్.లవన్న, ఈవో, శ్రీశైల దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment