
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో–35 అమలు కోరుతూ సినీ నిర్మాత నట్టి కుమార్ ఇచ్చిన వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సినిమాస్ రెగ్యులేషన్స్ చట్టం 1995లోని సెక్షన్ 9, 10, 11లను అనుసరించి ఆయన వినతిపై నిర్ణయం తీసుకోవాలంది. న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
మునిసిపాలిటీలు, నగరాలు, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది. అయితే, జీవోకు విరుద్ధంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని, ఇదే రీతిలో విశాఖపట్నంలోని శ్రీలక్ష్మి థియేటర్ యాజమాన్యం అధిక ధరకు టికెట్లు అమ్ముతోందంటూ నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 35 అమలు కోసం తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.