సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ జాతీయస్థాయిలో 18 అవార్డులు ప్రకటించగా.. వాటిలో ఏకంగా ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ దక్కించుకుంది. దీంతో కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 108 జాతీయ అవార్డులను దక్కించుకుని ఏపీ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అవార్డులు దక్కించుకున్న వాటిల్లో సైబర్ మిత్ర (మహిళా భద్రత)తో పాటు అందుబాటులో నేరస్తుల వివరాలు (అఫెండర్ సెర్చ్), మహిళల భద్రత (ఉమెన్‌సేఫ్టీ) కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా, ఫ్యాక్షన్ గ్రామాల్లో నిందితుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన ‘సువిధ’ కార్యక్రమం అమలులో అనంతపురం జిల్లా, టెక్నాలజీలో పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ‘ప్రాజెక్ట్ టాటా’ కార్యక్రమం అమలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం స్కోచ్ అవార్డులను దక్కించుకున్నాయని ఏపీ పోలీస్ టెక్నాలజీ చీఫ్ పాలరాజు తెలిపారు. ఈ అవార్డుల్లో సైబర్ మిత్ర, ప్రొజెక్ట్ టాటా కార్యక్రమాలు రజత పతకాలు సాధించాయి.
సీఎం వైఎస్ జగన్ అభినందనలు
అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత అభినందించారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా పనిచేస్తోందని సీఎం, హోంమంత్రి ప్రశంసించారు.
ఏపీ పోలీస్ సమర్థత మరోసారి రుజువైంది
జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడంలో 11 నెలల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఏపీ పోలీస్ శాఖ సమర్థత జాతీయ స్థాయిలో మరోసారి రుజువైంది. ఇన్ని అవార్డులు సొంతం చేసుకోవడం గర్వకారణం. ఇప్పటి వరకు ఏపీ పోలీస్ శాఖ సాధించిన వాటిల్లో రెండు స్వర్ణ, 13 రజత పతకాలు ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. మహిళల భద్రతకు భరోసానిచ్చేలా సైబర్ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టి సైబర్ నేరాల బాధిత మహిళలు పోలీస్ స్టేషన్లకు రాకుండా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాం. వారికి ఏ సమస్య వచ్చినా వాట్సాప్ నంబర్ 91212 11100కు, డయల్ 112, 181, 100కు ఫోన్ చేసే చెప్పేలా పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలను అమలు చేస్తోంది.
– డీజీపీ సవాంగ్
ఏపీ పోలీస్‌కి అవార్డుల పంట
Published Thu, Dec 3 2020 4:39 AM | Last Updated on Thu, Dec 3 2020 4:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment