తవ్వేకొద్దీ బయటపడుతున్న మార్గదర్శి మోసాలు | Margadarsi Chit Fund Private Limited has diverted a huge amount | Sakshi
Sakshi News home page

తవ్వేకొద్దీ బయటపడుతున్న మార్గదర్శి మోసాలు

Published Wed, Mar 22 2023 4:01 AM | Last Updated on Wed, Mar 22 2023 4:51 AM

Margadarsi Chit Fund Private Limited has diverted a huge amount - Sakshi

సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ.459.98 కోట్ల సొమ్మును చట్టవిరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్, షేర్లు, తదితరాల్లోకి మళ్లించినట్లు ఆడిటింగ్‌లో అధికారులు నిర్ధారించారు. తద్వారా చందాదారుల సొమ్మును తమ వ్యక్తిగత లబ్ధి కోసం రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజ వినియోగించుకున్నట్లు స్పష్టమైంది.

తాజాగా ప్రతి చిట్‌ గ్రూపులో ఖాళీ చిట్లు, కంపెనీ పాడుకునే రెండో నెల చిట్ల లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. మార్గదర్శి మేనేజర్లు సమర్పించిన మినిట్స్‌ను విశ్లేషించిన ఆడిట్‌ అధికారులు ఈ మోసాలను గుర్తించారు. ఖాళీ చిట్లకు గానీ, ప్రతి చిట్‌ గ్రూపులో కంపెనీ పాడుకునే రెండో నెల చిట్‌కు సంబంధించి గానీ ఎటువంటి సొమ్ము (నెల వారీ చందా) చెల్లించలేదని వెల్లడైంది.

ప్రతి చిట్‌ గ్రూపులో రెండో నెల చిట్‌ పాటను కంపెనీయే పాడుకునే అవకాశం ఉంది. అందుకోసం అందరి చందాదారుల మాదిరిగానే కంపెనీ కూడా చందా కట్టాలి. కానీ చందా కట్టకుండానే ఆ రెండో నెల చిట్‌ను పాడుకుని కంపెనీ జమ చేసుకుంటోంది. కంపెనీ తరఫున కట్టా ల్సి న ఎటువంటి చందాలు కట్టకుండానే ప్రతి నెలా ప్రతి గ్రూపు నుంచి 5 శాతం కమీషన్‌ను తీసుకుంటోంది. 

ఆధారాలతో సహా వెలుగుచూసిన అక్రమాలు..
గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు మార్గదర్శి యూనిట్లలో ఈ మోసాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో ఐదు చిట్‌ గ్రూపులను విశ్లేషించగా వాటి ద్వారా రూ.1.18 కోట్లను చిట్‌ కమీషన్‌గా, రూ.1.73 కోట్లను రెండో నెల పాడుకున్న చిట్‌ సొమ్ముగా కంపెనీ జమ చేసుకుంది.

కానీ పాడుకున్న రెండో నెల చిట్‌ చందా.. అలాగే ఆ గ్రూపులో తన పేరు (ఫోర్‌మెన్‌) మీద ఉంచుకున్న ఖాళీ చిట్లకు చెల్లించా ల్సి న చందా సొమ్ము రూ.6.98 కోట్లు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 12 చిట్‌ గ్రూపులను విశ్లేషించినప్పుడు ఫోర్‌మెన్‌ కమీషన్‌ రూ.60.50 లక్షలు, రెండో నెల పాడుకున్న చిట్‌ మొత్తం రూ.1.05 కోట్లను కంపెనీ ఖాతాలో వేసుకున్నారు.

కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రెండో నెల చిట్‌ చందాలు, కంపెనీ పేరు మీద ఉన్న ఖాళీ చిట్ల చందాల మొత్తం రూ.54.85 లక్షలు కట్టలేదని తేలింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 28 చిట్‌ గ్రూపులను పరిశీలించినప్పుడు వాటికి ఫోర్‌మెన్‌ కమీషన్‌ రూ.3.47 కోట్లు, రెండో నెల పాడుకున్న చిట్ల మొత్తం రూ.2.73 కోట్లను కంపెనీ తీసుకుంది. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రూ.2.88 కోట్ల చందా సొమ్మును కట్టలేదు. 

భారీగా ఉల్లంఘనలు..
నెల వారీగా చందాదారులతోపాటు కట్టా ల్సి న సొమ్మును కట్టకుండానే కమీషన్‌ తీసుకోవడం, ప్రతి గ్రూపులోనూ చందా కట్టకుండానే రెండో నెల చిట్‌ను పాడుకుని ఆ సొమ్మును తీసుకోవడం ద్వారా మార్గదర్శిలో చిట్లు వేసిన వారిని రామోజీరావు, ఆయన కోడలు శైలజ మోసం చేసినట్లు స్పష్టమైంది.

చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును పణంగా పెట్టి భారీగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించారు. ఖాళీగా ఉన్న చిట్లకు సంబంధించి ఎటువంటి చందా చెల్లించకుండా మిగిలిన చందాదారులను మభ్యపెట్టినట్లు తేలింది.

ఈ ఉల్లంఘనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సంబంధిత మార్గదర్శి బ్రాంచ్‌లను ఆదేశించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ రామకృష్ణ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement