కారంచేడు పీఏసీఎస్ కార్యాలయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులకు చెందాల్సిన ఎరువులు, పురుగు మందులను టీడీపీ నేతలు అప్పనంగా కాజేశారు. రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు సరఫరా చేసిన ఎరువులు, పురుగు మందుల సొమ్మును టీడీపీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ స్వాహా చేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.38.79 లక్షలు నొక్కేశారు. పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ఈ బాగోతం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారం వెలగబెడుతున్న సమయంలో 2016 నుంచి 2018 మధ్యలో ఎరువులు, పురుగు మందుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను మింగేశారు. అక్రమాలకు పాల్పడింది అప్పటి కారంచేడు పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య కాగా అందుకు పూర్తిగా సహకారం అందించింది మాత్రం సీఈవో గంటా మల్లయ్య చౌదరి.
ఆడిట్‌లో బయటపడ్డ బండారం
జిల్లా సహకార శాఖ అధికారులు ఏటా పీఏసీఎస్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ జమానాలో సహకార శాఖ అధికారులు పీఏసీఎస్ ఆడిట్ చేయడానికి కూడా భయపడ్డారు. కారంచేడు పీఏసీఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు రావడంతో చివరకు మూడేళ్లకు సంబంధించి 2018లో సహకార శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించారు. అంటే 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఏకకాలంలో ఆడిట్ నిర్వహించారు. దీంతో అప్పటి వరకు జరిగిన అక్రమాలు కొంతమేర బయటపడ్డాయి. ఆడిట్ రిపోర్టును అప్పటి అధికారులు జిల్లా సహకార శాఖ అధికారులకు సమర్పించారు.
చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు
రైతులకు సరఫరా చేసేందుకు పీఏసీఎస్‌లకు ఎరువులు, పురుగు మందుల కొనుగోలు కోసం జిల్లా పీడీసీసీ బ్యాంకు రుణం రూపంలో నిధులు కేటాయిస్తుంది. అయితే కారంచేడు పీఏసీఎస్‌లో చైర్మన్‌తోపాటు సీఈవో కలిసి రూ.38,79,001.63 స్వాహా చేశారు. అప్పటి నుంచి పీఏసీఎస్ తీసుకున్న నిధులు బ్యాంకుకు తిరిగి జమ కాలేదు. బ్యాంకు సీఈఓ సొసైటీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే జిల్లా సహకార శాఖ అధికారులు మాత్రం కాజేసిన సొమ్మును తిరిగి వసూలు చేయడంలో మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. ఇంత వరకు వారిద్దరిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అంతుపట్టని అంశంగా మారింది.
విచారణతో వెలుగులోకి..
ఆడిట్ రిపోర్టు ఆధారంగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి కారంచేడు పీఏసీఎస్‌లో నిధుల స్వాహా విషయమై డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణ 2019లో చేపట్టారు. అయితే ఆడిట్ రిపోర్టులో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు విక్రయించి తద్వారా వచ్చిన నిధులను కాజేశారని తేలింది. మందులు అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము రూ.28,35,957ను పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య, సొసైటీ సీఈవో గంటా మల్లయ్య చౌదరి కలిసి కాజేశారని స్పష్టమైంది. దీంతోపాటు చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య ఒక్కడే రూ.10,43,044.63 కాజేశారని విచారణలో బయటపడింది. మొత్తం రూ.38,79,001.63 సొమ్మును కాజేశారని విచారణాధికారి జిల్లా సహకార శాఖ అధికారికి 2019 జనవరిలోనే నివేదిక అందించారు.
రికవరీకి నోటీసులిచ్చాం
కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ అప్పటి చైర్మన్‌కు, సీఈవోకు నోటీసులిచ్చాం. సహకార చట్టం సెక్షన్ 52 కింద నోటీసులు జారీ చేశాం. 2020 మార్చి 7వ తేదీన నోటీసులు వారికి అందాయి. వారు కాజేసిన సొమ్మును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాం. అయితే ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు వెలువడటంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించారు.
– ఎల్.సుధాకర్, డిప్యూటీ రిజిస్ట్రార్, సహకార శాఖ
చదవండి:
కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు
విషాదం: అమ్మకు తోడుగా వచ్చి..
Comments
Please login to add a commentAdd a comment