
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తుదిశ్వాస వరకు కృషి చేశారని పరిశ్రమ వర్గాలు, అధికార యంత్రాంగం గుర్తు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే దుబాయ్‌లో ఏపీ పెవిలియన్ ద్వారా రూ.5,150 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించేలా కృషి చేశారని, కోవిడ్ సమయలో చిన్న పరిశ్రమలను ఆదుకోవడం, కొత్త విధానాల రూపకల్పనలో పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు విలువనిచ్చారని పేర్కొంటున్నాయి.
పారిశ్రామికాభివృద్ధికి విశేష కృషి
పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేకపాటి గౌతమ్‌రెడ్డి తన పనితీరుతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మాటలు కాకుండా చేతలతో పనితీరు నిరూపించుకున్నారనేందుకు గణాంకాలే నిదర్శనమని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
విధానాల రూపకల్పనలో ప్రత్యేక ముద్ర
జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,004 సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.6,012 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 1,30,112 మందికి ఉపాధి లభించనుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రిగా ఉండగా ప్రభుత్వ సహకారంతో 78 భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.35,038 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చడమే కాకుండా 51,925 మందికి ఉపాధి లభించింది. ఇదే సమయంలో 53 భారీ ప్రాజెక్టులు, 5 ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,29,562 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇవి వాస్తవరూపం దాలిస్తే 1,60,768 మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2020–23, వైఎస్‌ఆర్ ఈఎంసీ కొప్పర్తి ఎలక్ట్రానిక్ పాలసీ, జగనన్న వైఎస్‌ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ పాలసీ 2020–23, జగనన్న వైఎస్‌ఆర్ బడుగు వికాసం పాలసీ 2020–23, ఏపీ ఐటీ పాలసీ 2021–24 రూపకల్పనలో గౌతమ్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు.
మౌలిక వసతులకు పెద్ద పీట...
పరిశ్రమలను ఆకర్షించాలంటే మెరుగైన మౌలిక వసతులు ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు అనుగుణంగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రికార్డు సమయంలో వైఎస్‌ఆర్ జిల్లా కొప్పర్తిలో 801 ఎకరాల్లో వైఎస్‌ఆర్ ఈఎంసీ, 3,155 ఎకరాల్లో వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రారంభించడంతో పాటు కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ అనుమతులు సాధించడంలో విశేష కృషి కనబరిచారు. అనంతపురం, విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు గట్టిగా కృషి చేశారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, రెండు స్కిల్ యూనివర్సిటీలు, 30 స్కిల్ కాలేజీల నిర్మాణంలో మంత్రి చొరవను గుర్తు చేసుకుంటున్నారు. మంత్రిగా ఉండగా ఐటీ రంగంలో రూ.4,800 కోట్ల విలువైన 35,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు.
చివరి వరకు పారిశ్రామిక ప్రగతి కోసం కృషి చేశారు. ఇటీవల దుబాయ్ పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించడంలో విజయవంతం అయ్యారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిది.
– సీవీ అచ్యుత్‌రావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ
పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్ది ప్రచారం చేయడంలో విజయవంతమయ్యారు. కోవిడ్ సమయంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మంత్రి గౌతమ్‌రెడ్డి కృషిని మరవలేం. ఆయన మరణం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బ.
– డి.తిరుపతి రాజు, చైర్మన్, సీఐఐ ఏపీచాప్టర్
మంత్రి గౌతమ్‌రెడ్డి నిత్యం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం పరితపించారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఆయనతో కలిసి పని చేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు.
– కృష్ణ ప్రసాద్, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్
విశాఖపట్నం: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలచివేసింది. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్‌రెడ్డిని మృత్యువు కబళించడం బాధాకరం.
– డాక్టర్ గేదెల శ్రీనుబాబు, పల్సస్ సంస్థ సీఈవో