త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్‌క్లేవ్‌': మేకపాటి | Mekapati Goutham Reddy Meets Niti Aayog Ceo In Delhi | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌ నిర్ణయాలకు ప్రముఖుల నీరాజనం’

Published Fri, Sep 11 2020 7:33 PM | Last Updated on Fri, Sep 11 2020 8:29 PM

Mekapati Goutham Reddy Meets Niti Aayog Ceo In Delhi - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంగీకరించిందని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక కేంద్ర బృందం ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ సింఘాల్ చెప్పారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఈ బృందాన్ని నడిపించేలా నోడల్ అధికారి నియమించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్‌క్లేవ్‌' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్  ఇవ్వనున్నారని తెలిపారు. బీహెచ్ఈఎల్ సీఎండీ, నీతి ఆయోగ్ సీఈవో తో సమావేశమైన మంత్రి మేకపాటి  గౌతమ్‌ రెడ్డి  ఆర్డీవో ఛైర్మన్, నేవీ అధ్యక్షుడు, వైమానికదళ ప్రధాన అధికారులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటి ఆలోచనలకు ప్రశంసలు అందాయి. (సీఎం జగన్‌ విజన్‌కు అభినందనలు)

మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలకు కేంద్రంలోని ప్రముఖులు నీరాజనం పలుకుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దొనకొండలో 'సోనిక్ సిస్టమ్' ఏర్పాటుకు సానుకూలత చూపారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అసలైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది ఇప్పుడేనన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో  భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్‌తో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటికి గల ఆలోచనలను బీహెచ్ఎల్ సీఎండీ ప్రశంసించారు. విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. (‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్‌’)

ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు
పాఠశాల విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. మంత్రి మేకపాటి ఇతర ప్రతిపాదనల పట్ల  కూడా బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు.  ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు, నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమవుతామని మంత్రికి తెలిపారు. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రిప్యూనర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక సోలార్ పానల్స్ ఏర్పాటు మంత్రి మేకపాటి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు. (ఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు)

నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ నుంచి ఎప్పుడైనా విశాఖలో 'డిజిటల్ సదస్సు' నిర్వహించేందుకు అమితాబ్ కాంత్ సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన, కీలక సంస్కరణలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమితాబ్ కాంత్ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్తు సమయంలో దేశంలోనే తొలుత స్పందించి ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నీతి ఆయోగ్ సీఈవో ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులలో ఏపీ మొదటి స్థానం కైవసం చేసుకోవడాన్ని ఆయన అభినందించారని మంత్రి పేర్కొన్నారు.

కరోనా విపత్తులో ప్రభుత్వ పాలన బాగుంది
ఏపీ పారిశ్రామిక విధానం గురించి ప్రస్తావించిన అమితాబ్ కాంత్. అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కాపీ కావాలని మంత్రిని అడిగారు. ఒకసారి పాలసీ కాపీ చదవుతానని నీతి ఆయోగ్ సీఈవో అన్నట్లు మంత్రి తెలిపారు. కరోనా విపత్తులో, ఆర్థిక లోటులో ప్రభుత్వ పాలన బాగుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించినపుడే భారతదేశ అభివృద్ధి జరిగినట్లని మంత్రి మేకపాటితో అమితాబ్ కాంత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గురించి అమితాబ్ కాంత్ ఆరా తీశారు .  సీఎం జగన్ నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్  స్కూళ్ల స్థాయిలో మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్న తీరును ఫోటోల ద్వారా అమితాబ్ కాంత్ మంత్రి మేకపాటి వివరించారు.  

ఈశాన్య భారత్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పోర్టుల పాత్ర కీలకమని, ఏపీలో జాతీయ స్థాయి పోర్టుగా భావనపాడు పోర్టును తీర్చిదిద్దేందుకు  కేంద్రం సహకారం ఉంటుందని నీతి ఆయోగ్ సీఈవో వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్న 30 నైపుణ్య కళాశాలలకు సహకారమందించాలని మంత్రి మేకపాటి కోరారు. వ్యవసాయం, పరిశ్రమలే రాష్ట్ర రెవెన్యూకి కీలకమని, అందుకు కేంద్ర సహకారమందించాలని మంత్రి కోరగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. పాఠశాల విద్య పూర్తయ్యే స్థాయి నుంచే నైపుణ్యం సాధించే విధంగా నైపుణ్య మానవవనరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రంగాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటయ్యే విధంగా చూడాలని నీతి ఆయోగ్ సీఈవోను ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ కోరారు.

ఏపీ నుంచి 8-9 యూరప్ దేశాలకు అవసరమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో కీలకమైన విశాఖ పోర్టుకు మరింత ఎగుమతుల సామర్థ్యం పెంచేందుకు అనుమతులు, సహకారం కావాలని విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ నీతి ఆయోగ్ సీఈవోను కోరారు. ఏపీ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.

'డిఫెన్స్'పై  ప్రత్యేక దృష్టి
డీఆర్డీవో, నావికా, వైమాణికదళ ప్రధాన అధికారులతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డితో  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో 'డిఫెన్స్'పై  ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆ రంగంలో అభివృద్ధికి  డీఆర్డీవో సహకారం కావాలని మంత్రి మేకపాటి కోరారు.  నౌకదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్‌తో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.

ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద యుద్ధాల సమయంలో ఉపయోగపడే 'నేవీ బేస్' స్థాపించాలని మంత్రి మేకపాటి కోరారు. యుద్ధాలు జరిగే సమయంలో ఏవైనా విమానాలు, ఓడలు మరమ్మతులకు గురైనపుడు నేవీ ఆధ్వర్యంలో నావల్ బేస్ ద్వారా విమానాలకు ఓడలలో తాత్కాలికంగా ఆశ్రయం పొందే అవకాశముంటుందన్నారు. అనంతరం, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవాను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని రక్షణ వ్యవస్థ, అభివృద్ధికి సహకారం కోసం మంత్రి మేకపాటి చర్చించారు. ఈ సమావేశం అనంతరం మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి మేకపాటి హైదరాబాద్ చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement