తెలుగుదేశం పార్టీ నాయకుల మైనింగ్ దందాకు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు అడ్డాగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ టీవీఎస్ కాంతారావు. అనుమతులు పొందింది గోరంత.. తవ్వి బొక్కసం చేసింది కొండంత. 2014–19 మధ్య కాలంలో టీవీఎస్ కాంతారావు చేసిన దందా అంతా ఇంతాకాదు. కోట్లాది రూపాయల ఖనిజం కొల్లగొట్టాడు. అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అతనికి ఇటు రాజకీయంగానూ, అటు అధికారుల పరంగానూ ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. దీంతో కోట్లాది రూపాయల ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ము చేసుకున్నాడు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంతారావు మైనింగ్ దందాతో చెలరేగిపోయాడు. అనుమతులు తీసుకోవడం ఒక సర్వే నంబర్‌లో.. తవ్వింది మరో సర్వే నంబర్‌లో. ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు.. స్వయానా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో బయటపడ్డాయి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు తవ్వారో అధికారులకే అంతుచిక్కలేదు.
దీంతో భారీగా పెనాల్టీలు విధించారు. నేమకల్లులో సర్వే నంబర్ 253లో అధికారికంగా అతనికిచ్చింది ఎకరా విస్తీర్ణంలో తవ్వుకోవాలని మాత్రమే. కానీ విచ్చలవిడిగా తవ్వడంతో అధికారులు రూ.కోట్లల్లో పెనాల్టీ విధించారు. అంతేకాదు అత్యంత కఠినమైన ఆర్‌ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్ట్ ద్వారా ఆస్తులు రికవరీ చేసుకోవాలని కూడా నోటీసులు ఇచ్చారు. కానీ తెలుగుదేశం హయాంలో ఏ అధికారీ అతని క్రషర్ల వైపు వెళ్లలేకపోయారు. కూతురు, అల్లుడు, తమ్ముడు, తమ్ముడి కొడుకు ఇలా అందరి పేరుమీదా కాంతారావు మైనింగ్ చేసి రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తీరు మైనింగ్ అధికారులనే నివ్వెరపోయేలా చేసింది.
అనుమతులు లేకుండా తవ్వారు
అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ మెటల్‌ను తవ్వి తరలించారు. అంతేకాకుండా పరిమితికి మించి ఎక్కువ భూమిలో తవ్వారు. దీంతో ఎక్కువ పెనాల్టీలు వేశాం. తహసీల్దార్లకు కూడా దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చాం. దీనిపై సదరు వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. దీనికి మేము రివిజన్ పిటిషన్లు కూడా వేశాం.
–బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్, గనులశాఖ
కఠిన చర్యలు తీసుకుంటాం
మైనింగ్ శాఖ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి ఆస్తులను గుర్తించి ఆర్‌ఆర్ యాక్ట్‌కింద వసూలు చేస్తాం. జరిమానాలు కట్టించి తీరతాం.
–ఎ.నిశాంత్‌రెడ్డి, ఆర్డీఓ, కళ్యాణదుర్గం
Comments
Please login to add a commentAdd a comment