నవంబర్ 2 నుండి పాఠశాలల పునఃప్రారంభం | Minister Adimulapu Suresh Comments Over IIIT Admission | Sakshi
Sakshi News home page

టెన్త్‌ మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు

Published Thu, Oct 22 2020 11:49 AM | Last Updated on Thu, Oct 22 2020 1:09 PM

Minister Adimulapu Suresh Comments Over IIIT Admission - Sakshi

సాక్షి, విజయవాడ :  ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో పదో తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. అందుకే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా ఎన్జీ రంగా, ఎస్వీ వెటర్నరీ, వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ డిప్లమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నవంబర్‌ 10 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం 1000 రూపాయిల అపరాధ రుసుంతో నవంబర్‌ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 28న పరీక్ష నిర్వహించి, డిసెంబర్‌ 5న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

ప్రవేశ పరీక్షకు ఓసీ అభ్యర్థులు- 300, బీసీ అభ్యర్థులు - 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయిలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష ఆఫ్‌లైన్‌లో  ఓఎంఆర్ షీట్‌లో నిర్వహిస్తామని, ఎలాంటి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ప్రతీ రోజూ కరోనా క్లాసులు చెప్తాం. విద్యార్థులకు ఇప్పటికే విద్యాకానుకలో మాస్కులు ఇచ్చాం. సెలవులు, సిలబస్ని తగ్గించాల్సి ఉంటుంది. మొదటి నెల రోజులు ఒక్క పూట పాఠశాలలు నిర్వహిస్తాం. తరువాత సమీక్షించి భవిష్యత్ ప్రణాలిక ప్రకటిస్తాం. ప్రతీ విద్యార్థి రోజు తప్పించి రోజు వచ్చేలా తరగతులు. 1,3,5,7,9 తరగతులు ఒకరోజు నిర్వహిస్తాం. 2,4,6,8,10 తరగతులు ఇంకోరోజు నిర్వహిస్తాం. ఉపాధ్యాయులందరికీ రోజూ డీఎంహెచ్‌ఓ ద్వారా అవగాహన కల్పిస్తాం. ప్రతీ పాఠశాలకు వైద్య సిబ్బందిని, పీహెచ్‌సీలో డాక్టర్ని అందుబాటులో ఉంచుతా’’మన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement