ఒక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించకూడదో చెప్పాలంటే ‘జనసేన’ను మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. ఒక నాయకుడు ఎలా ఉండకూడదో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను చూపిస్తే చాలు. ఎదగాలన్న కసి, లక్ష్యం ఏ కోశానా కనిపించవు. కేడర్‌ను కూడగట్టుకుని పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచనే రాదు. టీడీపీని బలోపేతం చేయాలన్న తపన మాత్రం పవన్ ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబు–పవన్ కల్యాణ్ బంధం ప్రేమ జంటను మరిపిస్తోంది. నాడు విడివిడిగా పోటీ చేసినా, నేడు కలిసి పోటీ చేయాలనుకుంటున్నా అంతిమ లక్ష్యం బాబుకు మేలు జరగాలన్నదే. ‘మాది వన్ సైడ్ లవ్’ అంటూ మొన్న చంద్ర బాబు బాధ పడిపోవడం చూడలేక పవన్.. అన్నీ వదిలేసి.. నమ్ముకున్న వారిని గంగలో ముంచి.. ఆయన వేలు పట్టుకుని నడవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు.. పవన్‌తీరును తీవ్రంగా తప్పు పడుతూ, ఆయన ఎత్తులు, జిత్తులు గమనించాలని కోరుతూ ప్రజలకు లేఖ రాశారు.
సాక్షి, అమరావతి: ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయమంతా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే. బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం పరితపించే పవన్ కల్యాణ్, బాబుతో తన రాజకీయ వివాహ బంధాన్ని పదిల పరుచుకునేందుకు తహతహలాడుతున్నాడు. రైతుల పేరిట రెండు రోజుల పర్యటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అభిమానులు పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉండాలి’ అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా..
పొత్తు ఒక ఎత్తు
♦ నిన్న, మొన్న పవన్‌కల్యాణ్ చేసిన ప్రకటనలు ఆయన అసలు రూపాన్ని బయట పెడుతున్న నేపథ్యంలో, విజ్ఞులైన రాష్ట్ర ప్రజల ముందు కొన్ని అంశాలు ఉంచుతున్నాను. ప్రతిపక్షాలన్నింటితో పొత్తు అన్నది కేవలం పవన్ రాజకీయ ఎత్తు మాత్రమే.
♦ బీజేపీ–కమ్యూనిస్టులు ఒక పొత్తులో ఉండరని తెలిసే.. బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదని, తాము సొంతంగా గెలవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలే పలుమార్లు చెప్పిన నేపథ్యంలో, ఇక వారిని బాబు కోసం తాను వదులుకోక తప్పటం లేదన్న అభిప్రాయం కలిగించటానికే రైట్–లెఫ్ట్–సెంటర్ పార్టీలన్నీ కలిసి రావాలన్న వాదనను పవన్ ముందుకు తోశాడు.
♦ 2014 నుంచి 2018 వరకు బాబుతో పాటు బీజేపీతో కూడా పవన్ దోస్తీ ఏం చెబుతోందంటే.. బాబుకు మిత్రులైతే పవన్‌కు కూడా మిత్రులే. బాబు.. బీజేపీతో విడిపోతున్నప్పుడు పవన్‌ది కూడా అదే రాగం. 2018–19లో ఆయన స్టేట్‌మెంట్లు చూడండి. బీజేపీ మన రాష్ట్రాన్ని పొట్టలో పొడిచిందని, పాచి లడ్డూలు ఇచి్చందని, విడగొట్టి బీజేపీ సృష్టించిన సమస్యలు చాలు అని, కొత్తగా మరిన్ని ప్రత్యేక సమస్యలు సృష్టించవద్దు అని.. ఉత్తరాదికి దక్షిణాది వారు బానిసలు కారని.. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయబోతున్నానని చెప్పాడు. ఎందుకంటే ప్రత్యేక హోదా వద్దన్న బాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నానన్న సంకేతం పంపగానే పవన్ కల్యాణ్ అలా మాట్లాడారు.
♦ మరోవంక పవన్ కల్యాణ్‌ను టీడీపీ వారు ఏమీ అనకండని అదే సమయంలో చంద్రబాబు ప్రకటన చేయటం
గమనించాలి. అప్పట్లో ఆ పరిణామం దత్త తండ్రి, దత్త పుత్రుడి తెరచాటు, తెర ముందు బంధాలను అనుబంధాలను వెల్లడిస్తోంది.
వ్యూహాత్మకంగానే బీజేపీలోకి..
♦ తామిద్దరం కలిసి పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి చంద్రబాబుకు మేలు చేసే కుతంత్రంలో భాగంగానే పవన్ అడుగులు వేశారు. అయితే బాబు మేలు కాంక్షిస్తూ పవన్ తన పార్టీ నుంచి మంగళగిరిలో పోటీ పెట్టలేదు. మరోవంక.. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో చంద్రబాబు టీడీపీ ప్రచారానికి కూడా రాకపోవటాన్ని ప్రజలంతా గమనించారు. బాబు ఆదేశించాడు.. పవన్ ఆచరించాడు అంతే.
♦ మళ్లీ 2019 నుంచి బాబు కేసుల భయంతో మోడీని ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నప్పుడు.. వ్యూహంలో భాగంగానే సుజనా చౌదరి, సీఎం రమేశ్ సహా టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బాబు బీజేపీలోకి పంపాడు. అంతకు మించిన కామెడీ ఏమిటంటే.. ఆదినారాయణరెడ్డిని ఇదే చంద్రబాబు బీజేపీలోకి పంపాడు. అదే ఆదినారాయణరెడ్డి సొంత అన్న కొడుకే జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థి.
♦ బాబు ఆదేశాల మేరకు సీఎం రమేశ్ బీజేపీలోకి... అతని సోదరుడు సీఎం సురేశ్ మాత్రం టీడీపీలోనే! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే, పదవి పోయిన కొద్ది కాలానికే టీడీపీలో పచ్చకండువా కప్పుకోవటం అంటే.. బీజేపీ అధ్యక్షుడిగా కన్నా ఎవరి జేబులో ఉండి పని చేసినట్టు?
♦ సత్యకుమార్ బీజేపీ సిద్ధాంతాలకు బద్ధుడా? లేక బాబు ఎజెండాకు కంకణ బద్ధుడా? వీరందరి తరహాలోనే బీజేపీతో పొత్తు డ్రామా ఆడి తన మెంటార్, తన ప్రొడ్యూసర్ చంద్రబాబును రక్షించుకునే డ్రామాలో భాగంగానే పవన్ బీజేపీతో కలిశాడు. నాలుగేళ్లుగా ఈ డ్రామా నడిచింది.
బీజేపీని వదిలేయడానికి సాకు దొరికింది
♦ ఇప్పుడు బీజేపీకి కర్ణాటకలో ఎదురుగాలి వీస్తోందని ముందుగా సర్వేలు రాగానే.. బాబు–పవన్ మంతనాలు, వారి వ్యూహంలో మార్పులు జరిగిపోయాయి. ఒక వంక బీజేపీ నాయకత్వం.. చంద్రబాబును పచ్చి అవకాశ వాది, మోసగాడు అని.. అతనితో ఎన్నికల పొత్తే ఉండదని స్పష్టంగా పవన్‌కు చెప్పామని అంటోంది.
♦ బాబుతో కలవం అని, తమ క్యాడర్‌ను, ఓటర్‌ను తమ అస్తిత్వాన్ని కాపాడుకుని విస్తరించుకుంటాం అని బీజేపీ నాయకులు స్పష్టంగా చెపుతుంటే.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ అడగటం అంటే దాని అర్థం ఏమిటి? పొత్తు ఎవరితో? పొత్తు ఎవరి కోసం?
♦ దీని అర్థం కర్ణాటక పోల్ సర్వేల తర్వాత వ్యూహం మార్చుకుని బీజేపీని వదిలేసి, టీడీపీలో చేరటానికి మంచి సాకు పవన్‌కు దొరికిందనే కదా?
♦ గతంలో రెండుసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని, కేంద్రంలో పదవులు కూడా అనుభవించిన రోజున టీడీపీ.. 2019 ఎన్నికల తర్వాత మొన్నటి వరకు పవన్.. వీరిద్దరూ నేరుగా బీజేపీ పార్ట్నర్లు. బీజేపీకి ఫలితాలు అనుకూల పవనాలు ఉన్నంత కాలం... బాబు, పవన్‌ల రాగం తానం పల్లవి. అందుకు భిన్నంగా ఎదురుగాలి ఒక్కచోట వీచిందనగానే అవన్నీ రివర్స్‌లో మారిపోయాయి!
సొంతంగా ఎదగాలన్న లక్ష్యమే లేదు
♦ ప్రజలంతా ఒక్క విషయం గమనించాలని మనవి. ప్రాంతీయ పార్టీలు పెట్టిన వారు తమకు తాముగా ఎదగాలనుకుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. ఎంత ఒత్తిడినైనా భరిస్తారు. అలాంటి వారు ప్రజల్లోనే ఉంటారు. దేశంలో అధికారం తెచ్చుకున్న ఏ ప్రాంతీయ పార్టీని చూసినా ఇదే కనిపిస్తుంది.
♦ పవన్‌కు ఇందులో ఏ ఒక్క లక్షణం కూడా లేదు. అతనికి ఇండిపెండెంట్ క్యాడర్ అక్కర్లేదు. ఓట్లు అక్కర్లేదు. సీట్లు అక్కర్లేదన్నట్టు ఈ 15 ఏళ్లుగా రాజకీయాలు చేశాడు. దీని అర్థం ఏమిటి? ఇవన్నీ ఏం చెపుతున్నాయంటే.. బాబుకు పవన్ గత 10 ఏళ్లుగా జీ హుజూర్ అని. అతనికి కావాల్సింది అధికారం కాదు. ప్యాకేజీ మాత్రమే.
♦ ఇంత స్పష్టంగా అన్నీ తానే నిరూపిస్తూ.. ప్యాకేజీ స్టార్ అని ఎవరన్నా పిలవగానే పవన్ కల్యాణ్‌కు అంత ఉలుకెందుకు? తాను గెలవాలని, సీఎం కావాలని ఎవరైనా ప్రాంతీయ పార్టీ పెడతారా? లేక.. తనకే ఎమ్మెల్యేగా గెలిచే దిక్కు లేకపోయినా.. ఫలానా పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తా అని డాంబికం కోసం ఒక పార్టీ పెడతారా?
దత్త తండ్రి కోసం బతకడమే జీవితాశయం
♦ ఈ రోజుకీ పవన్ పార్టీకి లక్ష్యాలు లేవు. ఆశయాలు లేవు. ఎజెండాయే లేదు. అతని జీవితాశయం ఏమిటంటే.. దత్త తండ్రి కోసం దత్త పుత్రుడిగా బతకటం. తాను సీఎం రేసులోనే లేనని, తనకు బలం, బలగం లేవని, రావని చెప్పేసిన ఈ వ్యక్తి.. తక్షణం టీడీపీలో సభ్యత్వం తీసుకుని దుకాణం మూసేస్తే మంచిది.
♦ అంతో ఇంతో తనను నమ్మిన కాపుల ఓట్లన్నీ మూటగట్టి అమ్మటానికే పవన్ డ్రామాలు ఆడుతున్నాడని రెండేళ్ల క్రితమే సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అదే నిజం అని మరోసారి నిరూపణ అయింది. పవన్ కల్యాణ్ చెబుతున్న సామాజిక న్యాయం అన్నది తోటకూర కట్టో, గోంగూర కట్టో అని కూడా అర్థం అయిన తర్వాత.. ఇక పవన్ కల్యాణ్‌కు వేరే పార్టీ ఎందుకు? పాలిటిక్స్ ఎందుకు?
♦ వ్యక్తిగత జీవితంలో ఏ రాజకీయ విలువలుగానీ, నైతిక విలువలుగానీ లేని ఈయన, బాబు చెప్పినట్టు నటించే పొలిటికల్ యాక్టరే తప్ప, ప్రజా సేవకుడు కాడు, కాలేడు.
స్క్రిప్ట్ బాబుది.. యాక్షన్ దత్త పుత్రుడిది
♦ ఈ డ్రామాలన్నింటికీ బాబు చంద్రబాబే. స్క్రిప్ట్ బాబుది. యాక్షన్ దత్త పుత్రుడిది. 2014లో ఒక్క ఎమ్మెల్యే సీటుకుగానీ, ఒక్క ఎంపీ సీటుకు గానీ పోటీ పెట్టవద్దని బాబు ఆదేశిస్తే శిరసావహించిన పవన్.. 2019కి వచ్చేసరికి... ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లను చీల్చటానికి సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీలతో కూటమి ఏర్పాటు చేశాడు. 2019లో తాను ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెపుతున్నది పచ్చి అబద్ధం.
♦ 2019 తర్వాత బీజేపీతో బంధం.. 2023లో బీజేపీతో విడాకులకు రంగం సిద్ధం.. ఈ రెండూ బాబు చేత, బాబు వల్ల, బాబు కోసం పవన్ డ్రామాలు. ఏపీలో అధికార పార్టీ పాలన బాగోలేకపోయి ఉంటే.. ప్రతిపక్షానికి నల్లేరుమీద బండి నడక అయి ఉండేదే కదా? అదే పరిస్థితి ఉంటే బాబు ఒక్కడే ఒంటరిగా పోటీకి దిగేవాడే కదా?
♦ ఆ పరిస్థితి ఎక్కడా లేకపోగా.. పేదలకు, రైతులకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని సామాజిక వర్గాలకు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అండగా నిలబడిన సీఎం వైఎస్ జగన్‌కు మరింతగా ఆశీస్సులు ఇస్తున్నాం అని ప్రతి ఉప ఎన్నిక, ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019 తర్వాత కూడా ప్రజలు నిరూపించారు.
♦ 175 శాసనసభ స్థానాలకు 175 మంది టీడీపీ క్యాండిడేట్లు కూడా లేరు కాబట్టి, కనీసం 75 చోట్ల అభ్యర్థులే కరువు కాబట్టి చంద్రబాబు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నిజం పవన్ కల్యాణ్‌ను కూడా మరింతగా కుంగదీసినట్టుగా ఉంది. బాబుకు అభ్యర్థుల్లేరు.. ఒంటరిగా బరిలో దిగే ధైర్యం పవన్‌కు లేదు.
Comments
Please login to add a commentAdd a comment