సాక్షి, అమరావతి: లేపాక్షికి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు చేస్తామని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం చేనేత, జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్‌ల ఫొటోలు, అత్తుత్యుమంగా ఉండడానికి గల కారణాలపై తర్వాతి సమావేశానికి సమగ్ర వివరాలు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
పవర్ లూమ్ యూనిట్లకు అందించే పవర్ టారిఫ్ వివరాలు, ముద్ర రుణాలను మంత్రి గౌతమ్‌రెడ్డి ఆరా తీశారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌తో విక్రయాలను మరింత పెంచాలని సూచించారు. ఈ-కామర్స్ ద్వారా వచ్చే ఆర్డర్లను మూడు రోజుల్లో డెలివరీ చేసే స్థాయికి చేరాలని స్పష్టం చేశారు. ఖాదీ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎమ్ఈజీపీ), ఎంటర్‌ప్యూనర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఈడీపీ)లపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 షోరూంలు (ఏపీయేతరవి 3) కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినా స్వయంగా నడపగలిగినవే అన్నీ అని వివరించారు. తోలుబొమ్మలు, ఆదివాసీ పెయింటింగ్స్, ఏటికొప్పాక, కొండపల్లి, బంజారా ఎంబ్రయిడరీ వస్తువుల తయారీలో మరింత శిక్షణనందిస్తే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు.
ఎక్కువ నాణ్యత, రకరకాల డిజైన్ల తయారీతో ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండాలని పేర్కొన్నారు. ఒక జిల్లా ఒక వస్తువు విషయంలో మరింత చొరవ పెరగాలని తెలిపారు. తిరుపతి బాలాజీ, పుట్టపర్తి సాయిబాబా వంటి దేవుడి విగ్రహాల తయారీలో నైపుణ్యం పెంచి.. ఎక్కువ ప్రతిమల తయారీపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా బ్రాండింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఉంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్డీసీఎల్) ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment