
సాక్షి, కర్నూలు : ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. (మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం)
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు వసూలు చేశారని మండిపడ్డారు. కాగా, ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఇదివరకే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈఎస్‌ఐ స్కాంపై విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment