
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి
అనంతపురం సిటీ: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇటీవల జరిగిన ఘటనపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, ఎల్లోమీడియా కలిసికట్టుగా దుష్ప్రచారానికి ఒడిగట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి చంద్రబాబు విన్నవించిన అంశంపై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన చంద్రబాబు నీచ సంస్కృతికి నిదర్శనమని చెప్పారు.
పుంగనూరులో ఏం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. ఆ ఘటనను వైఎస్సార్‌సీపీకి ఆపాదించడం తగదని చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా పదేపదే అబద్ధాలు ప్రసారం చేయడం మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. టీడీపీ రాసిచ్చే స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తన పాలనలో సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనంటూ ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే సీబీఐ విచారణ కోరడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు.