‘రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్న మైనింగ్ సంస్కరణలు’ | Minister Peddireddy Ramachandra Reddy Review Meeting With Mining Officials | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్న మైనింగ్ సంస్కరణలు’

Published Tue, Apr 4 2023 1:14 PM | Last Updated on Tue, Apr 4 2023 1:20 PM

Minister Peddireddy Ramachandra Reddy Review Meeting With Mining Officials - Sakshi

సాక్షి,విజయవాడ: మైనింగ్ రంగంలో ప్రగతి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా రెవెన్యూ లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మైనింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంను తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం గనులశాఖ, ఎపిఎండిసి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 

1)2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దానిని అధిగమించి రూ.4692 కోట్లు ఆర్జించడం జరిగిదని అన్నారు. లక్ష్యాన్ని అధిగమించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. మేజర్ మినరల్స్ లో 81 శాతం సాధిస్తే, మైనర్ మినరల్స్ లో ఏకంగా 125 శాతం పురోగతిని సాధించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 2వేల మైనింగ్ ఏరియాలకు ఈ-ఆక్షన్ ఇవ్వాలని నిర్ణయించగా, దానిలో 539 ఏరియాలకు ఈ-ఆక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిలో 405 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యే దశలో ఉందని, వాటిల్లో 117 ఏరియాలకు ఈ-ఆక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని, మరో 134 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.  

2)రాష్ట్రంలో నాన్-వర్కింగ్ లీజులను అన్నింటిలోనూ మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మొత్తం 4222 లీజుల్లో ఇప్పటికే 3142 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మరో 1080 లీజుల్లో మైనింగ్ కోసం గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని లీజుల్లో మైనింగ్ ప్రారంభమైతే రాష్ట్రానికి అవసరమైన ఖనిజాల లభ్యత, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ లభిస్తాయని తెలిపారు.   

3)  ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ కలెక్షన్ లను అవుట్ సోర్సింగ్ ద్వారా వసూలు చేసే విధానంను మన రాష్ట్రంలోనూ అమలు చేయడం ద్వారా రెవెన్యూను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 5 జిల్లాల్లో ఇందుకు సంబంధించి టెండర్లను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానం అమలుకు టెండర్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ నుంచి సీనరేజీ, కన్సిడరేషన్ మొత్తాల రూపంలో స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. 

4)ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసి గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది తన ఆదాయాన్ని రెట్టింపు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.902 కోట్లు రెవెన్యూ వస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంకు ఏకంగా రూ.1801 కోట్లు సాధించడం జరిగిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంకు గానూ మొత్తం రూ.2137 కోట్లు మేర రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 

5)   జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలతో ధీటుగా మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో ఎపిఎండిసి నిర్వహిస్తున్న బొగ్గుగని ద్వారా గత ఏడాది 1.9మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, విక్రయించడం జరిగిందని అన్నారు. గత ఏడాది సుల్యారీ ద్వారా రూ.483.5 కోట్లు రెవెన్యూ ఆర్జించామని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దానిని రూ.1624 కోట్లకు పెంచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  మంగంపేటలోని బెరైటీస్ గనుల నుంచి ఎపిఎండిసి చరిత్రలోనే మొట్టమొదటి సారి ఏకంగా 3 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, రూ.1000 కోట్ల రెవెన్యూ మైలురాయిని అధిగమించడం జరిగిందని అన్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.1201 కోట్లు బెరైటీస్ ద్వారా రెవెన్యూ సాధించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1369 కోట్లు రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

6)   ఝార్ఝండ్ లోని బ్రహ్మదియాలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్ ఈ జూలై నెలలో ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే హెచ్ఎంబిసి, ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ లను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఎపిఎండిసి ముందంజలో ఉందని, దీనిని మరింత మెరుగుపరుచు కోవడం ద్వారా సంస్థను అగ్రగామిగా నిలబెట్టాలని కోరారు. 

ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి వైస్ ప్రెసిడెంట్ రామ్ నారాయణన్, సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్, గనులశాఖ జెడి రాజబాబు, డిడి రవిచంద్, ఎపిఎండిసి జీఎంలు టి.నతానేయల్, ఎ.నాగేశ్వరరెడ్డి, డిజిఎం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement