
సాక్షి, విశాఖపట్నం : పవన్‌కళ్యాణ్ ఎందుకు యాత్ర చేస్తున్నారో ఆయనకే తెలియదని, అందుకే ప్రజలు కూడా పవన్‌ను పట్టించుకోవడం మానేశారని టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన భీమిలి, విశాఖ పశ్చిమ, పెందుర్తి నియోజకవర్గాల అభివృద్ధి సమీక్షలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినితో కలిసి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో 9వ తేదీన వారాహి యాత్ర అని వస్తున్న వార్తలపై సుబ్బారెడ్డి మీడియాతో స్పందిస్తూ.. ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఒరిగేదేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వైఎస్సార్‌సీపీ దరిదాపులకు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
నాలుగేళ్లలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన, నిర్మాణ పనుల గురించి టీడీపీ నేతలకు నోరెందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరిగా శిలా ఫలకాల స్థాయిలో ఏ పనీ ఆగదని, అనుకున్న సమయానికి ప్రతి పనీ పూర్తిచేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పమన్నారు. ఇటీవల వలంటీర్ ఒక వృద్ధురాల్ని హత్య చేశారంటూ బురద జల్లే కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తే.. నిందితుడిని వలంటీర్ విధుల నుంచి ఎప్పుడో తొలగించేశారని తెలిసి మిన్నకుండిపోయారని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు రావడమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
చంద్రబాబు జోక్‌లు వేస్తున్నారు : మంత్రి రజిని
ఊరూరా తిరుగుతూ వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు వేస్తున్న పెద్ద జోక్‌లకు ప్రజలు పగలబడి నవ్వుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్ కో అడ్రస్ గల్లంతవుతుందన్న విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ విషయం తెలిసే.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే.. తమ హయాంలో ఏమీ చేయలేకపోయామన్న దుగ్ధతో టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment