Visakha Garjana Sabha: Ministers And Uttarandra JAC Leaders Speech Highlights - Sakshi
Sakshi News home page

పరిపాలన రాజధాని వచ్చే వరకూ విశ్రమించం

Published Sun, Oct 16 2022 4:27 AM | Last Updated on Sun, Oct 16 2022 11:35 AM

Ministers and JAC leaders in Visakha Garjana Sabha - Sakshi

వర్షంలో తడుస్తూనే ప్రసంగిస్తున్న మంత్రి బొత్స.. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు

సాక్షి, విశాఖపట్నం: ‘ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ.. అభివృద్ధి బాటలో నడిపించేందుకు చేపట్టిన ఉద్యమంలో ఇది తొలి అడుగు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేసుకునేంత వరకు ఊరూ వాడా ఏకమై ఉద్యమిద్దాం. మరోసారి రాష్ట్రం విడిపోకుండా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక నిర్ణయానికి ప్రతి ఒక్కరం మద్దతు పలుకుదాం.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిని ఈ ప్రాంతం లో నిషేధిద్దాం. ఉద్యమాల పురిటిగడ్డపై వేషగాళ్లు వెనకడుగు వేసేంత వరకూ గర్జిద్దాం..’ అంటూ నాన్‌ పొలిటికల్‌ జేఏసీ, మద్దతునిచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా సాగిన విశాఖ గర్జన ర్యాలీ ముగింపు సభ బీచ్‌రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం సమీపంలో జరిగింది.

విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన జేఏసీ నేతృత్వంలో జరిగిన ఈ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా, యువజన సంఘాల నేతలు పాల్గొని తమ ఆకాంక్షను చాటారు.  జేఏసీ నేతలు దేవుడు, కొయ్య ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, మాజీ మంత్రులు పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, మేయర్‌ జి.హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

విశాఖకు రాజధాని రావాల్సిందే 
వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలి. ఇప్పటికే మూడుసార్లు మన రాష్ట్రాన్ని విభజించారు. మళ్లీ అమరావతే ఏకైక రాజధాని అయితే.. భవిష్యత్తులోనూ మళ్లీ విభజన డిమాండ్‌ పురుడు పోసుకుంటుందనడంలో సందేహం లేదు.

రాజధాని వచ్చేంత వరకూ పోరాటం సాగిద్దాం. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. విశాఖకు రాజధాని రావాల్సిందే. 
– ప్రొఫెసర్‌ లజపతిరాయ్, నాన్‌ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌

టీడీపీ, జనసేనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇష్టం లేదు 
మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఇదే తరహాలో నినదిద్దాం. ఏపీ సువిశాలంగా.. మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌ కాంక్షిస్తుంటే.. అమరావతి పేరుతో 29 గ్రామాలున్న ప్రాంతానికి మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కుతంత్రాలు పన్నుతున్నారు.

పైన ఆకుపచ్చ చొక్కాలు.. లోపల పసుçపు పచ్చ ఆలోచనలతో.. తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పాదయాత్ర పేరుతో వారు దండయాత్ర చేస్తుండటం సిగ్గు చేటు. అధికారంలో ఉండగా, అమరావతి ప్రాంతంలో రైతులను దోచుకున్న చంద్రబాబే.. అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారు.

కేవలం విశాఖ మాత్రమే కాకుండా.. అమరావతి, కర్నూలు ప్రాంతాలు కూడా సమానాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పించినా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేని టీడీపీ, జనసేన దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు రాజధానులే ఈ రాష్ట్రానికి శరణ్యం. 
– మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

ఉత్తరాంధ్ర ప్రజలకు సెల్యూట్‌  
విశాఖను రాజధానిగా చేయాలన్న ఆకాంక్ష ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చిన జనానికి సెల్యూట్‌ చేస్తున్నా. విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతిచ్చేందుకు ఇంత మంది జనం తరలివస్తారని ఊహించలేదు.

విశాఖ గర్జనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించినా, వారి కుట్రలు ఫలించలేదు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను గౌరవించి విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతివ్వాలి. 
– గుడివాడ అమర్‌నాథ్, ఐటీ శాఖ మంత్రి

జగన్‌ ఉండగా.. మనకెందుకు భయం? 
విశాఖను పాలన రాజధానిగా చేయాలన్న తపన.. వేలాది మందిని ఇక్కడికి నడిపించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటూ ప్రకృతి కూడా గర్జించి.. ఆమోదం తెలిపింది. తాత ముత్తాతలు మూడేళ్లు కర్నూలు రాజధానికి వెళ్లారు. మన తండ్రులు, మనం హైదరాబాద్‌ వెళ్లాం. ఇకపై అక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో.. ఉత్తరాంధ్రని వెనుకబాటు నుంచి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖను పాలన రాజధానిగా ఎంపిక చేస్తూ అరుదైన అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోరారు.

మా ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న వారి ఆటలిక సాగవు. 130 ఏళ్ల నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు గర్జిస్తుంటే.. దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారు మిత్రులు కాదు.. ఉత్తరాంధ్ర ద్రోహులు.

విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ రాష్ట్రంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి అవసరమని సూచించింది.

రాష్ట్రంలో అన్ని నగరాలకంటే విశాఖపట్నం రాజధానికి సరైనదని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా.. చంద్రబాబు తన తొత్తులైన నారాయణ, సుజనాచౌదరి, ఇతర నేతలతో కూడిన కమిటీ వేసి రాజధాని అమరావతి అని నిర్ణయించేశారు.

ఈ అధికారం ఎవరు ఇచ్చారు? అప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం, ఏపీని తాకట్టు పెట్టడానికి 35వేల ఎకరాలు చుట్టేసి, చుట్టూ భూముల్ని చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసేశారు.

భవిష్యత్తులో హైదరాబాద్‌ మాదిరిగా.. అమరావతి నుంచి మనల్ని వెళ్లగొడితే దిక్కెవరు? ఇప్పటికైనా మనం గట్టిగా నిలబడదాం. బలమైన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఉండగా.. మనకెందుకు భయం? పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం.  
– ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి 

అందరూ బాగుండాలన్నదే మా ఆకాంక్ష 
విశాఖ వాసులు ఉక్కు సంకల్పంతో రాజధానిని సాధించుకోవాలనే కాంక్షతో భారీ వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా గర్జించారు. విశాఖ రాజధానిని సాధించుకొని బానిస సంకెళ్ల నుంచి బయటపడాలి. కర్నూలు, హైదరాబాద్‌ని రాజధాని చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు. కానీ.. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకూడదు. వికేంద్రీకరణ జరగాల్సిందే. విశాఖలో రాజధాని ఏర్పాటు కావాల్సిందే.

నాది గుంటూరు జిల్లా అయినా.. వికేంద్రీకరణ మా అభిమతం. విశాఖ ప్రజల ఉగ్రరూపం ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఈరోజు విశాఖ గర్జన చూస్తే చంద్రబాబు బ్యాచ్‌కు నిద్రపట్టదు. ఉక్కు సంకల్పంతో విశాఖను పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు సాధిస్తారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో చేస్తున్న పాదయాత్రతో దేనికి సంకేతమిస్తున్నారు? అందరూ బాగుండాలని మేము కోరుకుంటే.. అమరావతి మాత్రమే బాగుండాలని టీడీపీ, జనసేన, ఇతర నేతలు కోరుకోవడం సమంజసమేనా?  
– విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చెయ్యాలనుకుంటున్నారా? 
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది దివంగత వైఎస్సార్‌ కల. ఇవాళ విశాఖ గర్జన ర్యాలీకి ఇంత మంది తరలి రావడం చూసి ఆనందం ఉప్పొంగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న బలమైన ఆకాంక్షతోనే ఇంత మంది ప్రజలు విశాఖ గర్జనకు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంత మంది వచ్చారంటే వారంతా విశాఖకు మద్దతిస్తున్నారనే అర్థం.

విశాఖ రాజధాని కేవలం ఆ నగర ప్రజలకు మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తానికి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు విశాఖకు రాజధాని రావాల్సిన అవసరం ఉంది. పోర్టులు, రైల్వే ఫ్యాక్టరీ వంటి సదుపాయాలున్న విశాఖకు రాజధాని వస్తే పెట్టుబడులు పెరిగి నిధులు సమకూరుతాయి.

ఇలాంటి నగరాన్ని వదిలేసి రూ.5 లక్షల కోట్లతో రాజధానిని కట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేయాలనుకుంటున్నారు. అసలు అమరావతి ఎలా రాజధాని అవుతుంది? అది కేవలం దోపిడీ మాత్రమే. 29 గ్రామాలనే అభివృద్ధి చేసి దానిని రాజధాని అంటే ఎవరు నమ్ముతారు? అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ మద్దతివ్వాలి.    
– బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి  

టీడీపీ కార్యాలయాల్లో క్షుద్రపూజలు! 
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లీ బానిస బతుకులు బతకాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సంకల్పించారు. పరిపాలన రాజధాని వస్తే.. ఈ ప్రాం తంలో అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ.. మనం స్వతంత్రంగా ఉండకూడదనే కుటిలబుద్ధితో కొందరు లుచ్ఛాలు, పచ్చ నేతలు.. టీడీపీ, దానికి కొమ్ముకాస్తున్న పార్టీలు కలిసి.. టీడీపీ కార్యాలయాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా.. ఈ పోరాటం ఆగదు. రాబందుల్ని ఇక్కడి నుంచి పంపించి.. ఉత్తరాంధ్రకు రాజధాని సాధించేంత వరకు చేయి చేయి కలుపుతూ.. సీఎం జగన్‌ ఇచ్చిన అవకాశాన్ని నెరవేర్చుకుందాం.     
– కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్‌

విశాఖ నుంచి త్వరలో పరిపాలన  
అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని  సీఎం జగన్‌ సంకల్పిస్తే.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఆ ప్రాంతంలో తమ భూముల రేట్లు పెంచుకుని దోచుకోవాలని టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయి. సీఎం జగన్‌ నిర్ణయం మేరకు మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుంటాం. విశాఖ నుంచే సీఎం త్వరలో పరిపాలన సాగిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతంపై దండయాత్ర చేస్తున్న వారు, ఆ దండయాత్రకు మద్దతిస్తున్న టీడీపీ, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌లను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలి. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకునేందుకు, జేఏసీ ఏ పోరాటం చేసినా మద్దతు ఇస్తాం.     
– వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి విశాఖ ఇన్‌చార్జ్‌ 

మన ఆకాంక్ష నెరవేరే వరకు పోరాడుదాం 
ఈ ప్రాంతంపై దశాబ్దాలుగా పాలనా పరమైన వివక్ష చూపారు. ఈ కారణంగానే ఉత్తరాంధ్ర  వెనుకబాటుతనానికి గురైంది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు ఉద్యమాలు జరిగితే.. ఈరోజు మళ్లీ మన బతుకుల బాగు కోసం విశాఖే పరిపాలన రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్నాం. ఆకలి మంటలతో చచ్చే బదులు.. పోరాడి చద్దాం.

ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు.. ఈ కదన రంగంలోకి దిగాలి. మరో ఉద్యమం రాకుండా వికేంద్రీకరణ అనే పవిత్రమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారు. ఏపీని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల్ని నిలదీయాలి. మన హక్కుల్ని సాధించుకునే అవకాశం దశాబ్దాల తర్వాత సీఎం జగన్‌ ఇచ్చారు. పోరాడి తెచ్చుకుందాం. సీఎం ఇక్కడి నుంచి పాలన ప్రారంభించేంత వరకూ ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. 
– తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్‌

చంద్రబాబును, దత్తపుత్రుడిని తరిమికొట్టాలి 
రాయలసీమలో పుట్టినా ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతు ఇస్తున్నాను అంటే సీఎం జగన్‌ నిర్ణయం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకుంటూ, తుప్పు పట్టిన సైకిల్‌ చక్రం అధినేత చంద్రబాబు మన రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమలు అన్యాయానికి గురయ్యాయి. సీఎం జగన్‌ వికేంద్రీకరణ నిర్ణయానికి 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు.. అమరావతి రైతుల ముసుగులో వస్తున్న పెయిడ్‌ ఆర్టిస్టులకు మద్దతిస్తున్నారు.

వారిని తమిరి కొట్టాలా.. వద్దా? చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ పెళ్లి చేసుకోడానికి విశాఖ అమ్మాయి కావాలి. షూటింగులకు విశాఖ కావాలి. నటన నేర్చుకోడానికి వైజాగ్‌ కావాలి. చివరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా విశాఖ కావాలి. కానీ.. వైజాగ్‌కు రాజధాని వద్దు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? గాజువాక ప్రజలు విజన్‌ ఉన్న వాళ్లు కాబట్టే.. ఈయన నిజ స్వరూపం ముందే తెలుసుకొని చిత్తుగా ఓడించారు.

ఆకలి పోరాటం విలువ తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే.. పవన్‌ కల్యాణ్‌ చిత్తు అవ్వడం ఖాయం. వికేంద్రీకరణ కోరుకున్న వాళ్లంతా పిచ్చికుక్కలంటూ ఉత్తరాంధ్రలో పుట్టిపెరిగిన అచ్చోసిన ఆంబోతులా అచ్చెన్న మాట్లాడుతున్నారు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాలకు మాత్రమే కావాలనుకుంటున్న వారే పిచ్చికుక్కలు, గజ్జికుక్కలు, ఊరకుక్కలు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు చెయ్యలేని అభివృద్ధిని సీఎం జగన్‌ మూడేళ్లలో చేసి చూపించారు.
– ఆర్‌కే రోజా, పర్యాటక శాఖ మంత్రి 

ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్మడం లేదా?   
హైదరాబాద్‌ తరహాలో రాష్ట్ర సంపదంతా ఒకే చోట అమరావతిలో ఖర్చు చేశాక, మిగతా ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? ఇకపై ఇలా జరగరాదనే సీఎం జగన్‌ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. విశాఖ గర్జన చూశాక అయినా, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్‌ నాయుడు ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుసుకోవాలి.

అమరావతికే మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో లేదా? ఈనాడు రామోజీరావు ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్ముకోవడం లేదా? రాధాకృష్ణ, టీవీ–5 చానళ్లు ఇక్కడ నడపడం లేదా? వీళ్లందరికీ అమరావతి మీదే ఎందుకు ప్రేమ అంటే, వీళ్లంతా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామనుకున్నారు. జగన్‌ సీఎం అయ్యాక వారి పప్పులు ఉడకడం లేదు. అమరావతిలో రూ.40లక్షలు పెట్టి కొన్న భూములు రూ.4 కోట్లు కాలేదన్న బాధతో వీరంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు.

తమ ఆస్తుల కోసం ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు ఒక 420. పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు ఎందర్నో వేధించి.. 210 లోకేష్‌ కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు తన ఆస్తుల మీద, పార్టీ మీద, కొడుకు లోకేష్‌ మీద తప్పితే.. ప్రజల మీద ప్రేమ, దయ, బాధ్యత ఉండదు.

ఉత్తరాంధ్ర ద్రోహులందరినీ బ్యాన్‌ చెయ్యాలి. వారి పేపర్లు, పచ్చళ్లు కొనొద్దు, చానల్స్‌ రాకుండా కేబుల్‌ ఆపరేటర్లతో మాట్లాడండి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు.. వారు ఇటువైపు చూడాలంటే భయం కలిగేలా చేయండి. కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర అభివృది ్ధని కోరుకుంటున్నాయి. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందు తుంది.                
 – కొడాలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement