Non Political JAC Visakha Garjana Success With YSRCP Support, Details Inside - Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణకు మద్దతుగా 'గర్జించిన విశాఖ'

Published Sun, Oct 16 2022 3:16 AM | Last Updated on Sun, Oct 16 2022 11:48 AM

Non-political JAC Visakha Garjana success with YSRCP Support - Sakshi

వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన విశాఖ గర్జనకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

ఒకవైపు సముద్రం హోరు.. ఇంకో వైపు వర్షం జోరు.. మరో వైపు ఈ రెండింటితో పోటీపడుతూ జన గర్జన పోరు.. వికేంద్రీకరణ కోసం ఉద్యమ కెరటం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసింది. పరిపాలన రాజధానికి ‘విశాఖ గర్జన’ జైకొట్టింది. వరుణ దేవుడి సాక్షిగా అశేష జనవాహిని గర్జనతో విశాఖ దిక్కులు పిక్కటిల్లాయి. థింసా నృత్యం, చెక్కభజన, కొమ్ము నృత్యం, కోలాటం, తప్పెటగుళ్లు వంటి ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆద్యంతం వికేంద్రీకరణ నినాదాలు హోరెత్తాయి. పాలన రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే ఖబడ్దార్‌.. అంటూ ఉత్తరాంధ్ర జనం నిప్పులు చెరిగారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం/ డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన అంచనాలకు మించి విజయవంతమైంది. విశాఖపట్నానికి పరిపాలన రాజధానిగా చేయాలన్న నినాదం మిన్నంటింది. నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ గర్జన పాదయాత్ర, సభ ఆద్యంతం భారీ వర్షంలోనే కొనసాగింది. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది.

ఉదయం 9 గంటలకే ఎల్‌ఐసీ బిల్డింగ్‌ వద్ద గర్జన హడావుడి ప్రారంభం కాగా.. మొదట డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్‌తో పాటు పలువురు మంత్రులు నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఎల్‌ఐసీ బిల్డింగ్‌ నుంచి 10.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సెవన్‌హిల్స్‌ హాస్పిటల్‌ మీదుగా సర్క్యూట్‌ హౌస్, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీ గేటు నుంచి బీచ్‌ రోడ్డులోని పార్కు హోటల్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహం వరకు 3.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర మొత్తం వర్షంలోనే సాగింది.

ఇసుకవేస్తే రాలనంతగా జన సందోహం మధ్య పాదయాత్ర గంటకుపైగా సాగింది. అక్కడ దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గర్జన సభ మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జనం భారీగా హాజరయ్యారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు జై కొట్టారు. భారీగా కురుస్తున్న వర్షం తమను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉందని ఆనందపడ్డారు. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉప్పు పాతరేస్తామని హెచ్చరించారు.

ఈ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్‌లకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడుసార్లు విభజించారని.. మళ్లీ అమరావతి మాత్రమే రాజధాని అంటే భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమం నిర్వహించినా తాము మద్దతు ఇస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. మొత్తంగా సముద్రపు కెరటాల్లా ఎగసిపడ్డ జన సమూహం.. విశాఖకు జై కొట్టింది. 

విశాఖ గర్జనకు భారీ ర్యాలీగా తరలివస్తున్న జన సందోహం.. 

భారీగా పాల్గొన్న యువత 
ప్రధానంగా ఇన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఎక్కువగా నష్టపోయింది యువతే. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ ద్వారా పరిపాలన రాజధానిగా విశాఖ అవతరిస్తే ఇటు విద్యా రంగంతో పాటు ఉపాధి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తాయన్న ఆశ వారి మాటల్లో ధ్వనించింది. తద్వారా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది.

ర్యాలీలో వర్షం జోరులో చిందేస్తూ.. జై విశాఖ అని నినదిస్తూ యువతీ, యువకులు పోటీపడుతూ నినాదాలతో హోరెత్తించారు. పాలిటెక్నిక్‌ కాలేజీతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులు విశాఖ గర్జనలో భారీగా పాల్గొన్నారు.  విశాఖ పరిపాలన రాజధాని అయితే తమ బతుకులు మారతాయని.. ఉద్యోగాలకు వలస వెళ్లాల్సిన బాధలు తప్పుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులతో పోటీ పడి మరీ యువతులు చిందేస్తూ నినాదాలతో పాదయాత్ర కొనసాగించడం విశేషం. 

తీన్‌మార్‌ డప్పులు.. కోబ్రా డ్యాన్స్‌లు..
సాగరతీరాన ఉత్తరాంధ్ర ఆవేదన కడలి ఘోషలా మారింది. విశాఖ పరిపాలన రాజధాని వద్దంటూ..తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న వారికి వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రజానీకం.. కళాకారులు కడలి తరంగంలా ఎగసిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటే..పరిణామాలు మునుపటిలా ఉండవని సత్తా చూపారు. ‘గురజాడ, శ్రీశ్రీ, వంగపండు ప్రసాదరావు, రావి శాస్త్రి వంటి గొప్ప వారిని కన్న నేల ఉత్తరాంధ్ర.

అలాంటి మా ప్రాంతానికి రాజధాని వద్దా? ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి మీకు పట్టదా? అమరావతి రాజధాని పేరిట మాపై దండ యాత్రకు వస్తారా? మాకు కడుపు మండదా? అంటూ నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర కళాకారులు పాటలు, నృత్యాలు, జానపద గేయాలు, గిరిజన నృత్యాలు, బిందెలు తలపై ఉంచుకుని డ్యాన్స్‌లతో ప్రదర్శననిస్తూ.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలంటూ నినదించారు. ‘మన విశాఖ.. మన రాజధాని’ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరిశాయి.

విశాఖ గర్జనకు హాజరైన అశేష జన సందోహంలోని ఓ భాగం 

తప్పెటగుళ్లతో ఉత్తరాంధ్ర వెనుకబాటును వివరిస్తూ కళాకారుల ప్రదర్శన పలువురి మన్ననలు పొందింది. పులి వేషధారణతో కళాకారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొడుగాటి మనుషులమంటూ కాళ్లకు కర్రలు కట్టుకుని..నెత్తిన బిందెలు పెట్టుకుని వేసిన బిందెల డ్యాన్స్‌లు మురిపించాయి. పాముల వేషాలతో రెల్లి కులస్థులు వేసిన కోబ్రా డ్యాన్స్‌కు యువత సై కొట్టింది.

కళాకారులతో పాటు యువత కూడా ఆ నృత్యంలో భాగస్వాములై పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తీన్‌మార్‌ డప్పులు.. కాంగో డప్పులతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. కళాకారులు వాయించిన డప్పులకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృత్యాలు చేస్తూ విశాఖ గర్జనలో పలువురు పాలుపంచుకున్నారు. గిరిజనుల కోయ డ్యాన్సులు.. ఖాళీమాతా డ్యాన్సులు.. అష్టలక్ష్మి నృత్యాలు గర్జనకు తోడయ్యాయి.  

ఎటు చూసినా జన ప్రభంజనమే
విశాఖలో శనివారం ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. దీనికి భారీ వర్షం తోడు కావడంతో వీధులు, రోడ్లు ‘జన’ ‘సంద్రం’గా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఏ ఉద్యమానికి రానంతగా విశాఖ గర్జనకు జనం పోటెత్తి సరికొత్త చరిత్ర సృష్టించారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో గంటన్నరకు పైగా జనం వర్షంలో నిల్చుని మన విశాఖ.. మన రాజధాని అంటూ నినదించారు.

సర్వమత ప్రార్థనల అనంతరం జోరు వానలో తడిసి ముద్దవుతూ కొందరు.. గొడుగులు చేతబట్టి మరికొందరు అడుగులు ముందుకేశారు. ‘విశాఖే పరిపాలన రాజధాని’ అన్న నినాదాలతో ఉన్న జెండాలు ర్యాలీ పొడవునా రెపరెపలాడాయి. విశాఖ నగరంలో  9 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం గమనార్హం. 

అడుగడుగునా అదే ఆకాంక్ష 
విశాఖ గర్జనలో ఆసాంతం వికేంద్రీకరణ ఆకాంక్ష స్పష్టంగా కనిపించింది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ జనం ఉదయమే బయలుదేరారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటుకుని.. నిలువెల్లా తడుస్తూ తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఉదయం 9 గంటలకే ఎల్‌ఐసీ బిల్డింగ్‌ జంక్షన్‌ వద్ద కోలాహలం మొదలైంది.

ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో విశాఖ గర్జన ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభమైన తర్వాత వర్షం జోరు మరింత పెరిగింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కొనసాగించారు. కొద్ది మంది గొడుగులు పట్టుకుని పాదయాత్రకు రాగా.. ప్రధానంగా యువత మాత్రం వర్షంలో నినాదాలు చేస్తూ ముందుకు అడుగులు వేశారు.

విద్యార్థులు, న్యాయవాదులు, విద్యుత్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు విశాఖ గర్జనలో తమ నినాదాన్ని వినిపించారు. ఎక్కడికక్కడ పాదయాత్రకు స్థానిక విశాఖ జనం సాదరంగా ఆహ్వానం పలికారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement