పార్టీ కార్యకర్తలను సముదాయిస్తున్న పేర్ని నాని
టీడీపీ నేత సమక్షంలో కొట్టిన బందరు రూరల్ పోలీసులు
ఎస్‌ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే పేర్ని నాని డిమాండ్
చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్‌ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు.
మరో ఏఎస్సై, కానిస్టేబుల్‌తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్‌ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్‌ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్‌ఐలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment