సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీ వ్యాప్తంగా రెండో రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలో 25,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసురాలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది వేల కోట్లు వెచ్చించి భూములను కొనుగోలు చేసి పేదలకు ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగితే టీడీపీ నేతలు నిరూపించవచ్చని ఆయన సవాల్ విసిరారు.
‘‘చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారు. ఇచ్చేవారిని అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? సీఎం వైఎస్ జగన్.. టీడీపీ వారికి సైతం ఇళ్లపట్టాలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. ఆయన పోలవరం కట్టకుండానే భజనలు చేయించుకున్నారు. మనువడికి పోలవరం చూపించేందుకు డబ్బులు ఖర్చు చేశారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలని’’ వల్లభనేని వంశీ ప్రశ్నించారు.
వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి, ఎంపీ బాలశౌరి
గుడ్లవల్లేరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 2700 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గాదేపూడిలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఆవిష్కరించారు. మోహనరంగా వర్ధంతి సందర్భంగా నివాళర్పించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా మరణించి 32 సంవత్సరాలయినా ఇంకా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఆయన బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని తెలిపారు. కుల,మత,పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న వంగవీటి.. చరిత్రలో నిలిచిపోయారని కొడాలి నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment