వైఎస్సార్ చేయూత ద్వారా ఇకపై రూ.1.50 లక్షల వరకు
వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులకు ఇకపై రూ.1.20 లక్షల వరకు
ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు ఇకపై రూ.1.05 లక్షల వరకు
ఈ పథకాల ద్వారా గత ఐదేళ్లల్లో దాదాపు 43 లక్షల మందికి లబ్ధి
వచ్చే ఐదేళ్లు కూడా ఈ పథకాల కొనసాగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా, వారు ప్రతి నెలా మరింత స్థిర ఆదాయం పొందడానికి గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలను అమలు చేసింది. వచ్చే ఐదేళ్లు కూడా ఈ పథకాలను అమలు చేస్తామని తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.
ఈ మూడు పథకాల ద్వారానే రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అన్ని సామాజికవర్గాలకు చెందిన దాదాపు 43 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందారు. వీరిలో 18.37 లక్షల మంది ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుంటూ కొత్తగా వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటుకు ముందుకొచ్చారు.
మరికొంతమంది తమకు వచ్చిన శాశ్వత జీవనోపాధులను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇప్పటికే ప్రతి నెలా రూ. 10 వేల దాకా స్థిర ఆదాయం పొందుతున్నారు. ఆయా పథకాలను మరో ఐదేళ్ల పాటు కొనసాగించడం ద్వారా ఇంకా లక్షలాది పేద కుటుంబాలు ప్రతి నెలా స్థిర ఆదాయం పొందుతాయని అధికార వర్గాలు, ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు.
వైఎస్సార్ చేయూత
(తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూ.1.50 లక్షల వరకు) ఈ ఐదేళ్లు 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.75 వేలు ఇచ్చింది. ఇలా ఇప్పటికే రూ.19,189 కోట్లు అందజేసింది.
వచ్చే ఐదేళ్లూ ఇలా..
45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా చేయూత కావచ్చు.. ఇలా ఉండేలా చేయూత పథకాన్ని కొనసాగిస్తారు.
♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పన మరో రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి చేకూరినట్టవుతుంది.
♦ అలాగే బ్యాంకులతో, ప్రఖ్యాత సంస్థలతో టై అప్ కోసం సూచనలు, సలహాలు ఇస్తూ లేదా వారి సొంత వ్యాపారం ద్వారా వారు నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
వైఎస్సార్ కాపు నేస్తం
(కాపు అక్కచెల్లెమ్మలకు భరోసా.. ఇకపై రూ.1.20 లక్షల వరకు)
♦ 4.63 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం అందజేసింది. ఇలా ఇప్పటికే రూ.2,030 కోట్లు ఇచ్చింది.
♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ. 60 వేలు అందజేస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.20 లక్షల లబ్ధి.
♦ కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా కాపు నేస్తం కావొచ్చు.. ఇలా ఉండేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో రూ.60 వేలు అందజేస్తారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం
(అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు చేదోడు.. ఇకపై రూ.1.05 లక్షల వరకు)
♦ ఈ ఐదేళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,877 కోట్లు ప్రభుత్వం అందజేసింది.
♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ.60 వేలు అందిస్తుంది. మొత్తం ఏడు విడతల్లో రూ.1.05 లక్షల లబ్ధి
♦రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా ఈబీసీ నేస్తం కావొచ్చు. ఇలా ఉండేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో మరో రూ. 60 వేలు అందిస్తారు.
ఆర్థిక తోడ్పాటుకు అదనంగా..
♦ కేవలం ఆర్థికసాయం అందజేయడానికే ప్రభుత్వం పరిమితం కాలేదు. వైఎస్సార్ చేయూత తదితర పథకాల ద్వారా అందుకున్న నగదును ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది. గత ఐదేళ్లలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలతో ముందుకొచ్చిన లబ్ధిదారులకు అదనపు తోడ్పాటును కూడా అందించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల క్రితమే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ప్రాక్టర్ – గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
♦ ప్రభుత్వం అందజేసిన లబ్ధితో కొత్తగా శాశ్వత జీవనోపాధిని పొందడానికి ముందుకొచ్చిన వారికి ఆయా వ్యాపార సంస్థల ద్వారా తగిన శిక్షణ అందజేశారు. మిగిలిన రిటైల్ వ్యాపారుల కంటే తక్కువ ధరలకే ఆయా దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. లేదంటే అక్కచెల్లెమ్మలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా ఆయా సంస్థలే కొనుగోలు చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి.
♦ శాశ్వత జీవనోపాధిని పొందే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయానికి అదనంగా ఇంకా నిధుల అవసరం పడితే.. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తక్కువ వడ్డీకే అందేలా ప్రభుత్వం సహకారం
అందించింది.
Comments
Please login to add a commentAdd a comment