సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి తన దగ్గరున్న సమాచారంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు.
వివేకా లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అన్న వివరాలను అవినాష్ రెడ్డి ఇందులో వివరించారు.
"వివేకా హత్య తర్వాత శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. నేను పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. వివేకా మరణించినట్టు శివప్రకాష్ రెడ్డే నాకు చెప్పారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. మేము వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, మొబైల్ దాచిపెట్టమని హైదరాబాద్ నుంచి సునీత భర్త ఫోన్ లో ఆదేశించారు. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని వివేకా లెటర్‌లో రాశారు.
హత్య అని తేల్చే లేఖను ఎలా దాచిపెడతారు? లెటర్ దాచిపెట్టమని నేనే చెప్పానని సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వివేకా చనిపోయారు, చాలా బ్లడ్ ఉందని మాత్రమే నేను సీబీఐకి చెప్పాను. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని" అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్‌మెంట్‌లో వివేకా రెండో భార్య షమీమ్ సంచలన విషయాలు
వివేకా కుటుంబానికి హత్య విషయం తెలిసినా చాలా సేపటివరకు మౌనంగా ఉన్నారని, హత్య విషయం తెలిసినా వెంటనే ఎందుకు పోలీసులకు చెప్పలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వివేకా కుటుంబం మౌనంగా ఉండడం.. పోలీసులకు చెప్పకపోవడం వెనక అనుమానాలున్నాయని అన్నారు. ఆ కోణంలో సిబిఐ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని, తనను ఇరికించేందుకే సిబిఐ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని, ఈ కేసులో అన్ని విషయాలు నిజాయతీగా నిగ్గుతేలాల్సిన అవసరం ఉందని అన్నారు అవినాష్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment