పట్టు దారం తీస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు జిల్లా వి.కోట మండలం రామాపురం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జి.కుమార్. ఐదెకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఒకసారి పంట సాగు చేయడానికి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఏటా ఐదారు పంటలు తీస్తున్నామని కుమార్ చెప్పారు. ఇలా ఐదెకరాల్లో ప్రతి పంటకూ రూ.2 లక్షల వరకు ఆదాయం లభిస్తోందని కుమార్ వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకం సున్నితమైన అంశమని, చిన్న పిల్లల మాదిరిగా వాటిని పెంచుతామని వివరించారు. వాటికి తగిన ఉష్ణోగ్రత, సమపాళ్లలో వెలుతురు ఉండేలా చూసుకుంటే పట్టు పురుగుల పెంపకం కష్టమేమీ కాదన్నారు. తాను మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగులు పెంచడం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు తాను ఏ పంటలోనూ నష్టపోలేదని కుమార్ చెప్పారు.
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మల్బరీ సాగు ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మూడేళ్లుగా మల్బరీ సాగు పెరుగుతూ ప్రస్తుతం.. 1,26,828 లక్షల ఎకరాలకు విస్తరించింది. 2022–23 సంవత్సరంలో మరో 12 వేల ఎకరాల్లో సాగును విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ‘సిల్క్ సమగ్ర–2’ కింద వచ్చే ఐదేళ్లలో పట్టు పురుగుల పెంపకం చేపట్టే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. పట్టు గూళ్లను విక్రయించే రైతులకు రూ.45 కోట్ల మేర రాయితీ చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం 13.35 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న పట్టు పురుగుల పెంపక రంగం (సెరీ కల్చర్) ద్వారా రానున్న రోజుల్లో మరింత మంది రైతుల చేత సాగు చేయించేందుకు కార్యాచరణ చేపట్టింది.
గ్రామీణులకు ఉపాధి మార్గం
వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమ్మేళనంగా ప్రసిద్ధి పొందిన పట్టు పరిశ్రమ ఉపాధి ఆధారిత రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో మార్కెటింగ్ తప్ప మిగిలిన కార్యకలాపాలన్నీ కుటీర పరిశ్రమగానే కొనసాగుతున్నాయి. హెక్టారు మల్బరీ సాగుతో ఏడాది పొడవునా 12 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ పంట మహిళలకు ఎంతో అనువుగా ఉంటోంది.
సెరీ కల్చర్‌లో చిత్తూరుకు రెండో స్థానం
చిత్తూరు జిల్లాలో 37,631 ఎకరాల్లో మల్బరీ సాగవుతుండగా.. రాష్ట్రంలోనే ఈ జిల్లా రెండో స్థానంలో ఉంది. కుప్పం, పలమనేరుతోపాటు చిత్తూరు ప్రాంతంలో దీని సాగు విస్తరించింది. కుప్పం పరిధిలో 3, పలమనేరు పరిధిలో 10, చిత్తూరు పరిధిలో 2 చాకీ పురుగుల పెంపక కేంద్రాలు ఉండగా.. పెద్ద పురుగుల్ని పెంచే గదులు కుప్పం డివిజన్‌లో 6,500, పలమనేరు డివిజన్‌లో 6,000, చిత్తూరు డివిజన్‌లో 500 కలిపి 13 వేల వరకు ఉన్నాయి. జిల్లాలో రైతులు పండించిన పట్టు గూళ్లను వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టు దారం తీసే కేంద్రాలను పునరుద్ధరించింది. వ్యవసాయేతర యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చే ప్రైవేట్ రీలర్లకు యంత్ర సామగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం 75% రాయితీ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment