డీఎస్పీకి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్
తాడిపత్రి రూరల్: ‘అల్లర్ల కేసుల్లో బెయిల్‌కు సంబంధించి నాకు పూచీకత్తు ఇచ్చే వారు లేరు. దమ్ముంటే అరెస్టు చేసి జైలుకు పంపండి’ అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ జనార్దననాయుడుకు టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ చేశారు. తాడిపత్రి మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను ఇంటికి వెళతానని, అక్కడికి వచ్చి అరెస్టు చెయ్యి.. అని అన్నారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఈనెల 24న అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి బైఠాయిస్తానని చెప్పారు.
గతంలో రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన సీతారామాంజనేయులు, డీటీసీ ప్రసాద్‌రావు, మాజీ మంత్రి పేర్ని నాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులకు ఇంతకుముందే కొంత సమయం ఇచ్చానని, ఇచ్చిన గడువు తీరడంతో ఈ నెల 24న అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి బైఠాయించనున్నట్లు తెలిపారు.
అల్లర్ల ఘటనలకు సంబంధించి తామిచ్చిన ఫిర్యాదు మేరకు మూడు కేసులు నమోదు చేయాలని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని, శాంతి భద్రతలు దెబ్బతినడానికి పోలీసు ఉన్నతాధికారులే బాధ్యులన్నారు. ఇకపై తాడిపత్రి నియోజకవర్గంలో ఏ పండుగకూ అనుమతులు తీసుకోబోమని, అవసరమైతే సమాచారం మాత్రమే ఇస్తామని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి బైండోవర్ చేయాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment