టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా..  | NEET Exam Cleared by Ongole Tea Seller in First Attempt | Sakshi
Sakshi News home page

టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా.. 

Published Thu, Mar 24 2022 10:57 AM | Last Updated on Thu, Mar 24 2022 3:32 PM

NEET Exam Cleared by Ongole Tea Seller in First Attempt - Sakshi

ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను అభినందిస్తున్న మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి, ఒంగోలు: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం..కన్నబిడ్డలను కష్టపడి చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. బిడ్డలకు కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేస్తోంది. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదువులో రాణించటం మొదలు పెట్టారు. ఆ కష్టం కాస్తా ఫలించింది. కుమారుడు మెడిసిన్‌కు సంబంధించి నీట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో ఉచితంగా ఎంబీబీఎస్‌ సీటు సాధించి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపాడు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. స్థానిక ధారావారితోటలో నివాసం ఉంటూ..ప్రకాశం భవన్‌ ముందు టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాసరి పిచ్చయ్య, మాధవిల కుమారుడు దాసరి వంశీకృష్ణ ఈ అరుదైన ఘనత సాధించాడు.

తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వంశీకృష్ణ చదువుకుంటూనే టీ కొట్టులో కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చివరకు మొన్నటి మెడిసిన్‌ నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్‌లో విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపీఠం మెడికల్‌ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పిచ్చయ్య ఎస్సీ కార్పొరేషన్‌లో రూ.లక్ష రుణం తీసుకొని జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె వైష్ణవి కూడా బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. వైష్ణవి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది.  
 
ప్రత్యేకంగా అభినందించిన మంత్రి బాలినేని
ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు చంద్రయ్య నగర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్‌ సీటు సాధించిన వంశీకృష్ణను వెన్ను తట్టి ప్రోత్సహించారు. సాధారణ టీకొట్టు నడుపుకుంటున్న వ్యక్తి కుమారుడు ఎంబీబీఎస్‌ సీటు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. యువత కష్టపడి చదువుకోవాలని బాలినేని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా దాసరి వంశీకృష్ణ పడిన కష్టం గురించి మంత్రికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తూతిక విశ్వనాథ్‌ శ్రీనివాస్‌ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద టీ అమ్ముకుంటూ కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్‌ సీటు సాధించాడని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా వంశీకృష్ణ చెల్లెలు వైష్ణవి చదువుకుందని, అదేవిధంగా బీటెక్‌లో చేరాక జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చిన ఆర్డర్‌ను మంత్రి బాలినేని చేతుల మీదుగా వంశీకృష్ణకు అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement