బావర్ ప్రతినిధులను ప్రశ్నించిన అంతర్జాతీయ నిపుణుల బృందం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున కనిష్టంగా 10 మీటర్లు.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతు, 1.5 మీటర్ల వెడల్పుతో డయాఫ్రం వాల్ (పునాది) పూర్తి చేయడానికి 15 నెలల సమయం పడుతుందని బావర్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తయిన నేపథ్యంలో.. గోదావరి వరదల్లోనూ పనులు చేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులు తేల్చారు. 9 నెలల్లో డయాఫ్రం వాల్‌ను పూర్తి చేయలేరా అని బావర్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు.
దాంతో.. వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని బావర్ ప్రతినిధులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వర్క్‌షాప్ రెండో రోజూ గురువారం కూడా కొనసాగింది. వర్క్‌షాప్ ప్రారంభంలో డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఇప్పటికే సిద్ధం చేసిన ప్లాట్‌ఫాం, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని వైబ్రో కాంపాక్షన్ చేసి యథాస్థితికి తెచ్చిన పనులపై చర్చించారు. ఆ తర్వాత గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా నిరి్మంచే డయాఫ్రం వాల్ డిజైన్‌ను మేఘా సంస్థ తరఫున డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఆఫ్రి సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
డిజైన్‌పై అంతర్జాతీయ నిపుణులు, సీడబ్ల్యూసీ అధికారులు లేవనెత్తిన సాంకేతిక అంశాలను ఆఫ్రి సంస్థ ప్రతినిధులు నివృత్తి చేశారు. అంతర్జాతీయ నిపుణులు సూచించిన మేరకు డిజైన్‌లో మార్పులు చేసి పంపాలని సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి మూడు ట్రెంచ్ కట్టర్లు, గడ్డర్లు, 605 ప్యానళ్లు వినియోగిస్తున్నామని.. జనవరిలో పనులు ప్రారంభించి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని బావర్ ప్రతినిధులు చెప్పారు. యంత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ, అంతర్జాతీయ నిపుణులు సూచించారు. కాగా.. శుక్రవారం గ్యాప్–1లో 564 మీటర్లు, గాయ్‌ప్–2లో 1,750 మీటర్ల పొడవున నిర్మించాల్సిన ప్రధాన డ్యాం డిజైన్, నిర్మాణంపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment