పిల్లాడిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న సీఐ యుగంధర్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. పోలీసులు శనివారం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అయితే ఘటనలో బాలుడు ఎక్కడకు వెళ్లాడు? ఏమయ్యాడు? ఎలా దొరికాడనే విషయాలు తెలిస్తే.. వీడు పిల్లాడు కాదు.. పిడుగు అనిపిస్తుంది. టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాలు.. ప్రశాంత్‌నగర్‌కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నట్టు చెప్పి కనిపించకుండాపోయాడు.
తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్‌నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతకసాగారు. ఇదిలా ఉండగా, విష్ణువర్దన్ నిన్న సాయంత్రానికే చిత్తూరు నుంచి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ గ్రామానికి చేరుకున్నాడు.
చీకటి పడడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు చేరుకున్నాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిపై కోపంతో విష్ణువర్ధన్ అంతదూరం నడుచుకుంటూ తన అమ్మమ్మ, తాత ఇంటికి ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు తడకరకు బస్సులో వెళ్లిన విష్ణువర్దన్.. అక్కడక్కడా చూసిన కొండగుర్తులతో దిగువ తడకరకు నడిచి వెళ్లడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment