అడుసుమల్లి సంధ్య, అసిస్టెంట్ ఎంవీఐ, పి.తిరుపాల్, హోంగార్డు
సాక్షి, అమరావతి: సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా స్వాధీనం (సీజ్) చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒంగోలు అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు పి.తిరుపాల్ రెడ్డి ఇందుకు బాధ్యులుగా నిర్ధారించి, వారిపై చర్యలు తీసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం ప్రైవేటు ట్రావెల్స్ కారులో తిరుమలకు బయల్దేరింది. బుధవారం రాత్రి టిఫిన్ కోసం ఒంగోలులో ఆగారు.
అక్కడికి వచ్చిన ఒంగోలు రవాణా శాఖ అధికారులు సీఎం కాన్వాయ్ కోసమంటూ వారి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఈ ఉదంతంపై విచారించారు. ఒంగోలు అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు పి.తిరుపాల్‌రెడ్డి ఇందుకు బాధ్యులుగా నిర్ధారించారు.
అసిస్టెంట్ ఎంవీఐని సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డు తిరుపాల్ రెడ్డిని పోలీసు శాఖకు సరెండ్ చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘తిరుమల వెళ్తున్న భక్తులపట్ల ఒంగోలు రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణిస్తున్నాం. సీఎం కాన్వాయ్ కోసమని ప్రైవేటు వాహనాలు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. ఒంగోలు అసిస్టెంట్ ఎంవీఐ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదు. భక్తులకు ఇబ్బంది కలిగించిన ఉదంతంలో వారిద్దరూ బాధ్యులని విచారణలో వెల్లడైంది. వారిపై చర్యలు తీసుకున్నాం’ అని రవాణా శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ చెప్పారు.
ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నాం : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు: తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును స్వాధీనం చేసుకోవడం దురదృష్టకర ఘటన అని, ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నామని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం సభా వేదిక, ఏబీయం కాలేజీ ఆవరణలో హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో కలిసి బాలినేని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను ఆదేశించామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment