ఉన్నత విద్యలో తెరపైకి ‘ఆన్‌లైన్ మూల్యాంకనం’
అన్ని వర్సిటీలు, అనుబంధ కాలేజీలకూ ఒకే సంస్థ
మూల్యాంకనం నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక
∙ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి జవాబు పత్రాలు వెళితే పారదర్శకత ఉంటుందా? అని ప్రశ్న
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికత వినియోగం పేరుతో ఉన్నత విద్యామండలి ‘నిధులకు’ టెండర్ పెట్టింది. పేద విద్యార్థులు కట్టిన ఫీజులను ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చే నెపంతో.. రూ.కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ విధానంలో విద్యార్థులెవ్వరూ ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయరు. కేవలం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను మాత్రమే కంప్యూటర్‌లో చూస్తూ మార్కులు వేయాల్సి ఉంటుంది. అంటే జవాబు పత్రాలను స్కానింగ్ చేసి పంపిస్తే.. వాటిని మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఉన్నత విద్యా మండలి టెండర్లు పిలిచింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ‘మార్కులు’..
విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళితే వాటి పారదర్శకత ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. పైగా అధ్యాపకులు కూడా కంప్యూటర్‌పై చూస్తూ మూల్యాంకనం చేసి మార్కులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో మాన్యువల్‌గా నమోదు చేయాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వల్ల మార్కులను ట్యాంపరింగ్ చేసినా.. గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
పరీక్షల ప్రశ్నపత్రాల ముద్రణలోనూ సాంకేతికత పేరుతో విద్యార్థుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో యూనివర్సిటీలకు, కాలేజీలకు పంపించి.. పరీక్షకు కొన్ని క్షణాల ముందు వాటిని ప్రింట్ తీసుకొని ఇచ్చేలా ఆలోచనలు చేస్తోంది.
ఒకవేళ పరీక్ష సమయానికి ప్రింటింగ్‌లో సమస్యలు తలెత్తితే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాగే ప్రశ్నపత్రాలు లీకయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టు ఎందుకు నిర్వహించలేదు?
రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల పరిధిలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ వేర్వేరు యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ఒకే సంస్థ ఆన్‌లైన్‌లో పరీక్షల మూల్యాంకనం చేపట్టడం ఎంత వరకు విజయవంతం అవుతుందనే అనుమానాన్ని విద్యావేత్తలు లేవనెత్తుతున్నారు.
కనీసం పైలెట్ ప్రాజెక్టు కింద ఏదైనా యూనివర్సిటీ పరిధిలో అయినా నిర్వహించాలనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కొందరు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమ స్వలాభం కోసమే చేపడుతున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment