సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవయవాల మార్పిడి కోసం గత ఏడాది వరకు 56,852 మంది వెయిటింగ్‌లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం పార్లమెంట్‌లో వెల్లడించింది. అలాగే గతేడాది 16,041 మందికి అవయవాల మార్పిడి చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా అవయవాల వారీగా రోగులను జాతీయ రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నట్లు తెలిపింది. మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు రోగుల నమోదు రుసుము వసూలును నిలుపుదల చేసినట్లు చెప్పింది.
గతంలో 65 సంవత్సరాల్లోపు వ్యక్తుల నుంచి మాత్రమే అవయవ దానాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా మరణించిన ఏ వయసు వ్యక్తి అయినా అవయవదానం చేయడానికి అనుమతించామని తెలిపింది. ఈ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం పంపించినట్లు వెల్లడించింది. అవయవ మార్పిడిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశం నిర్వహించామని, ఒక దేశం ఒకే విధానం అమలు చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొంది.
వెయిటింగ్‌లో ప్రాధాన్యతను నిర్ణయించడం కోసం ప్రారంభ నమోదును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశ వ్యాప్తంగా అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహించడానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఐదు ప్రాంతీయ అవయవాల మార్పిడి సంస్థలను, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో సహా 20 రాష్ట్రాల్లో అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా కిడ్నీల కోసం, తరువాత కాలేయాల కోసం రోగులు ఎదురు చూస్తున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment