కుమార స్వామి, జ్యోత్స్న వంశీప్రియ, సత్య శ్రీజ
సాక్షి నెట్‌వర్క్ : చదువు నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకుపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ పిల్లలు అక్కడ ఎలా ఉన్నారోనని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీరు తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. తమ పిల్లలను క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
మా అబ్బాయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో..?
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలోని నడిమింటి సీతంనాయుడు, సరస్వతిల ఏకైక కుమారుడు కుమారస్వామి మరికొద్దిరోజుల్లో చదువు పూర్తిచేసుకుని స్వస్థలానికి వస్తాడని ఎదురుచూస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ తల్లిదండ్రుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తమ కుమారుడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడోనని ఆందోళన చెందుతున్నారు. తాను క్షేమంగా ఉన్నానని కుమారస్వామి గురువారం ఫోన్‌లో తెలియజేసాడు.
మా బిడ్డను క్షేమంగా తీసుకురండి
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురుకు చెందిన బుద్దాల వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), హైమావతిల కుమార్తె రిషిత క్రిస్మస్ సెలవుల తర్వాత ఈనెల 7న తిరిగి ఉక్రెయిన్ వెళ్లింది. కానీ, ఇప్పుడక్కడ నెలకొన్న యుద్ధంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రిషిత ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే కాల్పులు జరుగుతున్నాయని, ఆ వీడియోలు చూస్తుంటే భయమేస్తోందన్నారు. తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని సత్తిబాబు ప్రభుత్వాన్ని కోరారు.
యూనివర్సిటీ నుంచి సహకారం లేదు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామానికి చెందిన జోత్స్న వంశీప్రియతోపాటు అక్కడి విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని జ్యోత్స్న తల్లిదండ్రులు ఇజ్జిని షాలేమ్‌రాజు, సువార్త చెబుతున్నారు. తమ కుమార్తె కోసం విమాన టికెట్ బుక్‌చేసినప్పటికీ ఎయిర్‌పోర్టును మూసివేశారని, ఎలా రావాలో అర్థం కావట్లేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్శిటీ నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు.
ఎప్పుడేం జరుగుతుందో..
ఉక్రెయిన్‌పై రష్యా గురువారం నుంచి బాంబుల వర్షం కురిపిస్తుండడంతో గుంటూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన వైద్య విద్యార్థి ఫహీమ్ అక్రమ్ తల్లిదండ్రులు మహబుబ్‌బాషా, ఫమీదా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. తాను క్షేమంగా ఉన్నానని అక్రమ్ సమాచారం ఇవ్వడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.
మా బిడ్డ యూనివర్సిటీ పక్కనే యుద్ధం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విశాఖ జిల్లా రాంపురానికి చెందిన రెడ్డి నోముల సత్య శ్రీజ తల్లిదండ్రులు అర్జున్, వరలక్ష్మి తల్లడిల్లిపోతున్నారు. తమ కుమార్తె శ్రీజ చదువుతున్న యూనివర్శిటీకి దగ్గర్లోనే యుద్ధం జరుగుతోందని.. తమ కుమార్తెను ఎలాగోలా తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే, తనను స్వదేశానికి తీసుకురావాలని శ్రీజ కూడా వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరింది.
భయపడకండి.. సీఎం కృషి చేస్తున్నారు
తమ కుమార్తెను ఇక్కడకు రప్పించాలంటూ విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కుకు చెందిన బొమ్ము శివరామకృష్ణారెడ్డి, సదా వెంకటలక్ష్మీ దంపతులు గురువారం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఉక్రెయిన్‌లో ఉంటున్న యువతితో ఫోన్‌లో మాట్లాడి భయపడొద్దని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ ఇందుకోసం కృషిచేస్తున్నారని ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment