న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతోంది. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి వేలసంఖ్యలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన వారిని కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా భారత్ చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి శనివారం ఒక్కరోజే 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 83 మంది, తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు తరలి వచ్చారు. ఢిల్లీలో వీరికి స్వాగతం పలికిన ఏపీ తెలంగాణ అధికారులు అక్కడే వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆనంతరం వీరందరిని స్వస్థలాలకు పంపనున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: ఉక్రెయిన్.. భారతీయుల తరలింపులో సమస్యలు!
ఇక ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 450 మంది విద్యార్థులు భారత్‌కు చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇంకా ఉక్రెయిన్‌లో 350 వరకు తెలుగు విద్యార్ధులు ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు ఇండియా చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతూ.. మిగిలిన విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment