సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లోని మైకోలివ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పీ అండ్ టీ కాలనీ వాసి మద్దెల గీతానంద కోసం ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి పెట్రోమోలియా బ్లాక్ సీ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఈమె ప్రస్తుతం బంకర్‌లో తలదాచుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నట్లు తండ్రి గంగారాం ‘సాక్షి’కి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్‌లో ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు గీత హాజరుకావాల్సి ఉంది. అయితే యుద్ధ మేఘాలు అలుముకోవడంతో నెల రోజుల క్రితమే ఆమెను తల్లిదండ్రులు తక్షణం తిరిగి వచ్చేయాల్సిందిగా పదేపదే కోరారు. కానీ యూనివర్సిటీ వర్గాలు యుద్ధం రాదని చెప్తూ గీతానందతో పాటు ఇతర విద్యార్థులనూ అడ్డుకున్నారు.
సరిహద్దులకు 1,500 కిమీ దూరంలో..
కీవ్‌లో ఉన్న విద్యార్థులను పోలెండ్‌కు తరలించి అక్కడ నుంచి భారత్‌కు తీసుకువస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌కు తూర్పు భాగంలో ఉన్న మైకోలివ్ ఈ సరిహద్దుకు 1,500 కి.మీ దూరంలో ఉంది. కాస్త సమీపంలో ఉన్న హంగేరీ లేదా రొమేనియాల నుంచి వీరిని తరలించేందుకు అవకాశం ఉంది. కానీ ఈ ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు వంద మంది భారతీయ విద్యార్థులపై ఎంబసీ దృష్టి పెట్టట్లేదు. వీరిలో గీత ఒక్కరే తెలుగు యువతి కావడం గమనార్హం. యుద్ధం మొదలైన నాటి నుంచీ గీతతో పాటు సహ విద్యార్థులూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన రష్యా బలగాలు దుకాణాలను లూటీ చేస్తున్నాయని, దీంతో సోమవారం నుంచి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
బయటకు వెళ్లే పరిస్థితి లేదు
ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి ఐదు నిమిషాలకు ఓ పేలుడు వినిపిస్తోంది. కరెంట్, ఆహారంతో పాటు ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు లేవు. ఆహారం, నీరు కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం మా దగ్గర ఏమీ లేవు. ఎవరైనా స్పందించి ఆదుకోకపోతే కనీసం సరిహద్దులకూ చేరుకోలేం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎంబసీ వర్గాలు పట్టించుకోవాలి.
– తల్లిదండ్రులకు పంపిన సెల్ఫీ వీడియోలో గీత
తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి
అంధుడినైన నేను నా జీవితం మొత్తం దివ్యాంగుల సేవలోనే గడిపా. ఇప్పుడు నా కుమార్తె ఉక్రెయిన్‌లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్ రాజధాని, దాని చుట్టుపక్కల మినహా ఇతర ప్రాంతాలపై ఎంబసీ దృష్టి పెట్టట్లేదు. ఇప్పటికైనా స్పందించి అక్కడున్న వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారిని రప్పించడానికి ప్రయత్నించాలి.
– గంగారాం, గీత తండ్రి
Comments
Please login to add a commentAdd a comment