పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పవన్‌కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వలంటీర్లు
సాక్షి, అమరావతి: వలంటీర్ల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే సేవామూర్తులు.. సంక్షేమ సారథులు! దేశమంతా వారి పనితీరును మెచ్చుకుంది. కోవిడ్ వేళ మానవతా మూర్తులుగా నిలిచిన వలంటీర్ల సేవలను ప్రధాని సైతం అభినందించారు. మూటలు మోసే ఉద్యోగాలని తొలుత వలంటీర్లను తూలనాడిన వారు ఆ తరువాత నోట మాట రాక సర్దుకున్నారు. నాలుగేళ్లలో కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.25 లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జమ చేయడం వెనుక ఇంటింటికీ తిరిగి అర్హులను గుర్తించిన వలంటీర్ల కృషి దాగి ఉంది.
ఇంత సంక్షేమం సాకారం కావడం.. ప్రతి ఇల్లూ లబ్ధి పొందిన సంతోషంతో కళకళలాడటం దుష్ట చతుష్టయానికి మింగుడు పడటం లేదు! వలంటీర్ వ్యవస్థపై ఓ పథకం ప్రకారం బురద చల్లుతూ యాక్షన్‌లోకి దిగాయి! పాత కథనాలను వల్లె వేస్తూ స్క్రిప్టు ప్రకారం తమతమ పాత్రలను పక్కాగా పోషిస్తున్నాయి! అందులో తాజా అంకమే వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పోలుస్తూ జనసేనాని తన శక్తిమేరకు ఈ డ్రామాను రక్తి కట్టించడం!!
మహమ్మారికి ముకుతాడు..
2019 ఆగస్టు 15వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన వలంటీర్ల వ్యవస్థ తమ అత్యుత్తమ సేవలతో రాష్ట్ర ప్రజందరి మనన్నలు పొందడమే కాకుండా దేశానికే ఆదర్శంగా మారింది. పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 70–100 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్ల నియామకంతో పాలనలో వేగం పెరిగి ఏ కార్యక్రమమైనా గంటల వ్యవధిలోనే ప్రజల చెంతకు చేరేందుకు దోహదపడింది.
కరోనా సమయంలో సర్వే ద్వారా బాధితులను మూడు రోజుల వ్యవధిలోనే గుర్తించి మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తోడ్పడింది. కోవిడ్ బారినపడ్డ వారి వద్దకు వెళ్లేందుకు సొంత కుటుంబ సభ్యులే జంకినా వలంటీర్లు మాత్రం వెనుకాడలేదు. ఎప్పటికప్పుడు వ్యాధి సోకినవారిని గుర్తిస్తూ వైద్య సేవలను అందచేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడారు.
నాలుగు నెలల వ్యవధిలో 14 విడతలు ఫీవర్ సర్వే నిర్వహించి సమర్థంగా కోవిడ్‌ను కట్టడి చేయగలిగారు. వలంటీర్ల వ్యవస్థ క్షేత్రస్థాయిలో అత్యంత సమర్ధంగా పనిచేయడం ద్వారా ఒకే రోజు రికార్డు స్థాయిలో 13.59 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వం అందజేసింది. కరోనా సమయంలో వలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రత్యేకంగా ప్రశంసించారు.
పడిగాపులు లేవు.. పలకరింపులే
గతంలో అవ్వాతాతలు పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే నడవలేని పరిస్థితిలో కూడా కచ్చితంగా రావాల్సిన దుస్థితి. ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఎక్కడిస్తారో అంతుబట్టక ప్రతి నెలా కార్యాలయాల వద్ద దయనీయంగా పడిగాపులు కాయాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వలంటీర్లు టంచన్‌గా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చిరునవ్వుతో పలుకరిస్తూ వైఎస్సార్ పెన్షన్ కానుక సొమ్మును అందజేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెలా మొదటి తారీఖునే దాదాపు 64 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏ చిన్న ఇబ్బందీ కలుగకుండా దాదాపు రూ.1,750 కోట్లు వలంటీర్ల ద్వారా వారి చేతికి అందుతున్నాయి.
నేరుగా, పారదర్శకంగా రూ.2.25 లక్షల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ విధానంలో 8.06 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.25 లక్షల కోట్లను నేరుగా జమ చేసింది. ప్రతి పథకం అమలు సమయంలో అర్హులకు సమాచారం ఇవ్వడంతోపాటు అనంతరం డబ్బులు అందినట్లు ఈ–కేవైసీ ద్వారా లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుంటున్నారు. తద్వారా పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏ పథకంలోనూ ఎక్కడా అవినీతికి తావులేని పరిస్థితిని తీసుకొచ్చింది.
దేశానికే దిక్సూచిగా..
సంక్షేమ పథకాల అమలుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్‌లు, విద్య, సామాజిక రంగ నిపుణులతో కూడిన కమిటీ వలంటీర్ల పనితీరును పరిశీలించి దేశమంతా అమలు చేయాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో వలంటీర్ల సేవలను గుర్తించిన కేరళ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అనంతపురం జిల్లాలో పర్యటించిన కర్ణాటక ఐఏఎస్ అధికారుల బృందం తమ రాష్ట్రంలోనూ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర సర్కారు సైతం వలంటీర్ల సేవలకు ప్రశంసించింది.
పథకం ప్రకారం వ్యవస్థపై విషం..
► వలంటీర్లు మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. వలంటీర్ల వ్యవస్థ ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారింది. ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛకు పెను విఘాతంగా మారింది. వలంటీర్ల వ్యవస్థ ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యవస్థ ఓ మాఫియాలా మారిందని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వలంటీర్ల అరాచకాల గురించి చెబుతూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది.
– 2022 డిసెంబరు 10న ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.
► వలంటీర్లనే సమాంతర సర్కారీ వ్యవస్థను సృష్టించి స్వీయ కార్యాలను చక్కబెట్టుకోగలుతున్నారు. వాటికి ప్రజలు మూగ ప్రేక్షకులు, బాధితులు కావాల్సి రావడమే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఏలిన నాటి శని మహిమ.
– 2023 మార్చి 3న ‘ఈనాడు’ ఎడిటోరియల్
► ఊళ్లల్లో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. బెదిరింపులు, అవినీతికి పాల్పడుతున్నారు.
– 2021 అక్టోబరు 30న కుప్పం పర్యటనలో చంద్రబాబు.
► వలంటీర్లకు సన్మానమంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండగ చేసుకుంటున్నారు.
– 2022 ఏప్రిల్ 7న చంద్రబాబు ట్వీట్
► వలంటీర్ల కథేంటో చూస్తాం. ఆ వ్యవస్థే దండగ. టీడీపీ కార్యకర్తలు వలంటీర్ల లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి పార్టీ ఆఫీసు నెంబరుకు వాట్సాప్ చేస్తే వారి సంగతి చూసుకుంటాం. ఈ వివరాలు పంపిన వారికి రూ.10 వేల పారితోషికం కూడా పార్టీ తరఫున ఇస్తాం.
– 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
► ‘వలంటీర్లు ప్రతి గ్రామంలో ఏ కుటుంబంలో ఆడపిల్లలకు ఏ లోపాలున్నాయి? ఎలాంటి అలవాట్లు ఉన్నాయి? ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులున్నారా? అనే సమాచారాన్ని వలంటీర్లు ఇవ్వడంతో మహిళలను ట్రాప్ చేసి కిడ్నాపులు చేస్తున్నారు.
– 2023 జూలై 9న ఏలూరులో పవన్‌కల్యాణ్
Comments
Please login to add a commentAdd a comment