వైఎస్సార్‌ జలకళ; ఎవరు అర్హులంటే.. | Peddireddy Ramachandra Reddy Released Guidelines Of YSR Jalakala | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జలకళ; ఎవరు అర్హులంటే..

Published Fri, Oct 9 2020 8:35 PM | Last Updated on Fri, Oct 9 2020 9:34 PM

Peddireddy Ramachandra Reddy Released Guidelines Of YSR Jalakala - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ జలకళ పథకం అమలుపై జిఓ నెంబర్ 676 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అర్హులైన రైతులకు అవకాశం ఉన్న ప్రతి ఎకరానికి సాగునీటిని అందించేందుకు ఉచితంగా ప్రభుత్వం బోరుబావులను మంజూరు చేస్తూ, దానికి సంబంధించిన విదివిధానాలను జారీ చేసినట్లు తెలిపారు. నవరత్నాల్లో భాగంగా అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోరుబావులను తవ్వించి ఇవ్వాలన్న హామీని కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం వైఎస్సాఆర్‌ జలకళ పథకం ద్వారా ఉచితంగా రైతులకు బోరుబావులను మంజూరు చేస్తోందని, వెంటనే దీనిని ఆచరణలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు..

ఈ పథకం ద్వారా అందుబాటులో వున్న జలవనరులను సద్వినియోగం చేసుకుంటూ రైతాంగం వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు, తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని అన్నారు. ప్రతి ఎకరానికి సాగునీటిని అందించేందుకు భూగర్భ జలవనరులను వినియోగించుకునే విధంగా రాష్ట్రంలోని మొత్తం పదమూడు (13) జిల్లాల్లోని అర్హత కలిగిన రైతులకు ఉచిత బోర్ బావులను మంజూరు చేస్తోందని తెలిపారు. పథకం ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావులు పొందుతున్న రైతులకు ఉచితంగా మోటార్లు, పంపుసెట్లు, దానికి అవసరమైన విద్యుత్ పరికరాలు, పైప్‌లను కూడా అందచేసేందుకు గానూ జీఓనెంబర్ 677 ద్వారా పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను మీడియాకు విడుదల చేశారు. చదవండి: న్యాయ‍ వ్యవస్థను మూసేయాలన్న ఉద్ధేశంతోనే..

రైతులకు మరింత మేలు
వైఎస్సార్‌ జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేశారు. రైతులకు మరింత మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బోర్లు తవ్వించడంతోపాటు మోటారు పంపుసెట్‌ కూడా ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. బోర్లు ఏర్పాటుకు అవసరమయ్యే పరికరాలన్నీ ఉచితంగానే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌డీపీఎఫ్‌ పైప్‌, ఎలక్ట్రికల్‌ కేబుల్‌, ప్యానెల్‌ బోర్డ్‌ తదితర పరికరాలు చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ‘వారు చేతకాని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు’

వ్యవసాయ బోర్ బావి లేదా ట్యూబ్ బావి లేని ఏ రైతు అయినా ఈ పథకం కింద అర్హులవుతారు. అలాగే గతంలో బోరుబావి, లేదా ట్యూబ్‌ బావి ఉండి, అవి విఫలమైన పరిస్థితుల్లో సదరు రైతుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. జీఓ548 తేదీ:27.2.2020) ప్రకారం భూగర్భ జలాలను అధికంగా వినియోగించినట్లు నోటిఫై చేసిన 1094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం కింద బోరుబావులను మంజూరుకు అవకాశం లేదు.   

దరఖాస్తు విధానం
అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదారు పాసు పుస్తకం కాపీతో పాటు గ్రామ సచివాలయంలో నేరుగా గానీ, లేదా ఆన్‌లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలి. రైతు ఫోటో, పాసుబుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో కూడిన దరఖాస్తుతో పాటు రైతుకు సంబంధించిన పొలంను గ్రామ సచివాలయ స్థాయిలో విఆర్వో స్వయంగా పరిశీలిస్తారు. ఆ తరువాత సదరు దరఖాస్తును ఎంపీడీఓ లేదా డ్వామా ఏపీడీకు సమర్పిస్తారు. అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన దరఖాస్తులు ఎంపీడీఓ డ్వామా ఏపీడీలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆ తరువాత నుంచి రైతులు తమ దరఖాస్తు ఏ దశలో వుందో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలించుకునేందుకు సదుపాయం ఉంది. ఈ ప్రక్రియలో రైతులకు సంబంధించిన ఎటువంటి అభ్యర్ధనలు, అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో www.ysrjalakala.ap.gov.in వెబ్‌సైట్‌ లేదా స్పందన టోల్ ఫ్రీ నం 1902 ద్వారా కూడా అధికారులకు తెలియచేయవచ్చు.

సాంకేతిక అనుమతి ఎలా పొందాలి..
డ్వామా ఎపిడి, ఎంపిడిఓలు ధ్రువీకరించిన దరఖాస్తులను ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహించడానికి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డ్రిల్లింగ్ కాంట్రాక్టర్‌కు పంపుతారు. సదరు కాంట్రాక్టర్ రైతు పొలంలో బోరు పడేందుకు వీలుగా వున్న పరిస్థితులపై  భూగర్భ జలాలు, వాటర్ ఆడిట్ విభాగంలో నమోదు చేసుకున్న భూవిజ్ఞాన శాస్త్రవేత్త, భూ భౌతిక శాస్త్రవేత్త లతో సర్వే చేయించాల్సి వుంటుంది. ఈ డ్రిల్లింగ్ ప్రదేశం వాల్టా చట్టం పరిధిలో వుంటేనే దీనికి అనుమతి లభిస్తుంది. సదరు దరఖాస్తునకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నివేదికలను డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ డ్వామా ఎపిడి, ఎంపిడిఓలకు సమర్పిస్తారు. ఈ నివేదికలపై అవసరమైతే సాంకేతిక సలహాలను ఆయా జిల్లాల భూగర్భజలాల డిప్యూటీ డైరెక్టర్ లేదా, వాటర్ ఆడిట్ విభాగాల నుంచి అధికారులు పొందుతారు. 

వేగంగా పరిపాలనా అనుమతులు..
డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ నుంచి వచ్చిన ఫీజుబిలిటీ నివేదికల ఆధారంగా బోర్‌ డ్రిల్లింగ్ అంచనాలను డ్వామా ఎపిడి, ఎంపిడిఓలు తయారు చేస్తారు. ఈ అంచనా నివేదికను డ్వామా పిడికి పంపిస్తారు. ఈ నివేదికలను పరిశీలించిన తరువాత డ్వామా పిడి నుంచి జిల్లా కలెక్టర్‌కు పరిపాలనా అనుమతి కోసం పంపిస్తారు. చివరిగా జిల్లా కలెక్టర్ సదరు దరఖాస్తును పరిశీలించిన తరువాత దానికి అనుమతి ఇస్తారు. వెంటనే సదరు దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పిడి డ్వామా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఎంపిడిఓ, ఎపిడి, విఆర్వో, గ్రామసచివాలయ సిబ్బందితో పాటు లబ్ధిదారుడికి కూడా ఈ సమాచారం ఆన్‌లైన్‌లో వెంటనే అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా లబ్ధిదారుడికి ఎప్పటికప్పుడు దరఖాస్తు ప్రగతిపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. డ్వామా ఎపిడి, ఎంపిడిఓల ద్వారా వెంటనే మంజూరైన దరఖాస్తును సంబంధిత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్‌కు పంపిస్తారు. 

చకచకా పొలాల్లో డ్రిల్లింగ్...
అధికారుల నుంచి డ్రిల్లింగ్ అనుమతి లభించగానే సదరు డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ వర్క్‌ప్లాన్‌ను ఏపీడీ, ఎంపీడీఓలకు సమర్పిస్తారు. వారి అనుమతితో రైతుకు, స్థానిక అధికారులకు ఏ రోజు, ఏ ప్రదేశంలో డ్రిల్లింగ్ చేస్తున్నారో సమాచారం అందిస్తారు. నిర్ధిష్ట ప్రమాణాల మేరకు నీటి లభ్యత ఆధారంగా సదరు బోరుబావి విజయవంతంను నిర్ధారిస్తారు. డ్రిల్లింగ్ సందర్భంగా సదరు కాంట్రాక్టర్, రైతు సమక్షంలోనే అధికారులు జియో-ట్యాగ్ ఫోటోలను రికార్డు చేస్తారు. డ్రిల్లింగ్, కేసింగ్ అంశాలపై ప్రభుత్వం సూచించిన సాంకేతికత ఆధారంగా ఎంబుక్‌లో రికార్డు చేస్తారు. తమ మండల పరిధిలో జరిగిన డ్రిల్లింగ్‌ల్లో కనీసం పదిశాతం బోరుబావులను డ్వామా ఏపీడీ, ఎంపీడీఓలు సూపర్ చెక్ చేయాల్సి వుంది. 

ఆ తరువాత కాంట్రాక్టర్‌కు సక్సెస్‌ రేట్ ఆధారంగా బిల్లులు చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో డ్రిల్లింగ్ వేసిన ప్రదేశంలో నీటి లభ్యత లేక బోరు విఫలమైతే రెండోసారి సదరు రైతుకు అవకాశం ఇస్తారు. విఫలమైన బోరును రాళ్ళతో మూసివేస్తారు. వేసిన ప్రతిబోరు బావి పరిధిలో రీచార్జ్ పిట్, భూగర్భజలాల పరిరక్షణ చర్యలు చేపట్టాల్సి వుంటుంది. అలాగే ఈ పథకం కింద తవ్విన అన్ని బోర్ బావులకు సామాజిక ఆడిట్ నిర్వహించాల్సి వుంటుంది. నిర్ధిష్ట సమయంలోనే మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేలా పంచాయతీరాజ్‌ కమిఫనర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement