60.50 లక్షల మందికి  పింఛన్ల పంపిణీ | Pension Distribution Throughout Andhra Pradesh | Sakshi
Sakshi News home page

60.50 లక్షల మందికి  పింఛన్ల పంపిణీ

Published Wed, Jan 5 2022 3:13 AM | Last Updated on Wed, Jan 5 2022 4:48 AM

Pension Distribution Throughout Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: పింఛను రూ.2,500కు పెంపు పండుగ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా కొనసాగాయి. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కొత్తగా పింఛన్లు మంజూరైనవారికి మంజూరు పత్రాలను అందజేసి పెన్షన్‌ను పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి వరకు 60,50,768 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు పెరిగిన పింఛను డబ్బులను అందజేశారు. 97.99 శాతం మంది లబ్ధిదారులకు రూ.1,539.03 కోట్లు పంపిణీ చేశారు. బుధవారం కూడా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీతో పాటు పింఛన్ల పెంపు కార్యక్రమాలు కొనసాగుతాయని సెర్ప్‌ అధికారులు చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం, కాజులూరుల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మామిడికుదురులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రావులపాలెం, ఆత్రేయపురాల్లో ప్రభుత్వ విప్‌ జగ్గిరెడ్డి, ఐపోలవరంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ పింఛన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, మాచర్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కిలారి వెంకటరోశయ్య లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి, ఇంకొల్లులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు పింఛన్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, పెంటపాడులో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో ఎమ్మెల్యే ఎలీజా, ఉండ్రాజవరం మండలంలో ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు పింఛన్‌ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు.

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావిలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, బ్రహ్మసముద్రంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, పాల్తూరులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా కడపలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద తామరాపల్లిలో ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, పాలకొండలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, లావేరు మండలం మురపాకలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, కవిటి మండలం లండారిపుట్టుగలో ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నర్తు రామారావు, నందిగాం మండలం కణితూరులో కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ పెన్షన్లు అందజేశారు.

విజయవాడలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్, కార్పొరేటర్‌ అడపా శేషు పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి  పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం కమ్మోళ్లపల్లెలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎస్‌ఆర్‌పురం మండలం కటికపల్లెలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మదనపల్లె మండలం మాలేపాడులో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పీలేరు నియోజకవర్గం కలకడలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు, కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఎమ్మెల్సీ భరత్‌ పింఛన్లు పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా, కర్నూలు జిల్లాల్లో కూడా పింఛన్ల పంపిణీ చురుగ్గా కొనసాగింది.

దూరప్రాంతాలకు వెళ్లి పింఛన్ల పంపిణీ
► హైదరాబాద్‌ వెళ్లి డయాలసిస్‌ పేషెంట్‌కు..
► నెల్లూరు వెళ్లి గుండె ఆపరేషన్‌ చేయించుకున్న మహిళకు..
గాలివీడు/కమలాపురం (వల్లూరు): వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఇద్దరు వలంటీర్లు దూరప్రాంతాలకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గాలివీడు మండలం గోరాన్‌చెరువు గ్రామం కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన శివప్రసాద్‌ డయాలసిస్‌ కోసం 20 రోజుల కిందట హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అతడికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పెన్షన్‌ను వలంటీర్‌ వినోద్‌కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌ వెళ్లి అందజేశారు. కమలాపురం మండలం టి.చదిపిరాల్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మ ఇటీవల గుండె ఆపరేషన్‌ చేయించుకుని నెల్లూరులో కుమార్తె దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది. ఆమెకు ప్రభుత్వం ఇస్తున్న వితంతు పింఛనును వలంటీర్‌ రవీంద్ర మంగళవారం నెల్లూరు వెళ్లి అందజేశారు. వలంటీర్ల సేవాభావాన్ని లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులు ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement