పింఛన్లు ఇస్తూ.. శుభాకాంక్షలు | Pensions Released To Above 61 Lakh People In AP For January Month | Sakshi
Sakshi News home page

పింఛన్లు ఇస్తూ.. శుభాకాంక్షలు

Published Sat, Jan 2 2021 3:44 AM | Last Updated on Sat, Jan 2 2021 9:36 AM

Pensions Released To Above 61 Lakh People In AP For January Month - Sakshi

కర్నూలు జిల్లా దేవనకొండలో పెళ్లి దుస్తుల్లోనే వృద్ధుడికి పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: న్యూఇయర్‌ సందడి గురించి తెలియని ఎంతోమంది అవ్వాతాతల మోములో ఈ ఏడాది తొలిరోజు ఆనందంతో పాటు కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. నూతన సంవత్సరం తొలిరోజు తెల్లవారుజాము నుంచే వలంటీర్లు అవ్వాతాతలకు న్యూఇయర్‌ శుభాకాంక్షలు చెబుతూ, వారి చేతిలో పింఛను డబ్బులు పెట్టడంతో వారంతా ఉబ్బితబ్బిబయ్యారు. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒకటో తేదీ వస్తే చాలు వానొచ్చినా, సెలవురోజైనా, పండుగైనా లబ్ధిదారుల ఇంటికే వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. 

62,472 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు.. 
రాష్ట్రవ్యాప్తంగా 62,472 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల కొత్తగా పింఛన్లు మంజూరు చేసి వారికి కూడా డబ్బులు పంపిణీ చేసింది. తీవ్ర అనారోగ్యం పాలై ఇబ్బందిపడుతున్న 2,873 మందికి తోడు 59,599 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. వీటితో కలిపి మొత్తం 61,72,964 మందికి ప్రభుత్వం రూ.1,487.34 కోట్లు మంజూరు చేసింది. 

తొలిరోజు 57.53 లక్షల మందికి పింఛన్లు అందజేత 
కాగా, శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 57,53,964 మందికి వలంటీర్లు పింఛన్ల పంపిణీని పూర్తిచేశారు. తద్వారా రూ.1,377.51 కోట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం మూడ్రోజులపాటు కొనసాగుతుందని, తొలిరోజు 93.21 శాతం మందికి పంపిణీ పూర్తిచేసినట్లు సెర్ప్‌ సీఈఓ రాజాబాబు తెలిపారు. మొదటిరోజు తీసుకోని వారికి  శని, ఆదివారాల్లో పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు.. రెండు నెలలుగా వివిధ కారణాలతో పింఛను డబ్బులు తీసుకోలేకపోయిన 1,75,800 మందికి పాత బకాయిలతో కలిపి ఈనెల అందజేశారు. ఇక పింఛన్ల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు ఇవీ.. 
► కర్నూలు జిల్లా దేవనకొండకి చెందిన వలంటీర్‌ నరేష్‌ శుక్రవారం తన వివాహం ఉన్నప్పటికీ పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశాడు.  
► రెండు నెలలుగా తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో కేన్సర్‌ చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి చిత్తూరు జిల్లాకు చెందిన వలంటీరు వెంకటలక్ష్మి 160 కిలోమీటర్లు దూరం సొంత ఖర్చులతో ప్రయాణించి పింఛను అందజేశారు. 
► వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఆజాద్‌నగర్‌కు చెందిన రెడ్డెమ్మ స్విమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. వలంటీర్‌ నాగేంద్ర అక్కడకు వెళ్లి మరీ పింఛన్‌ అందించాడు. 
► చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్‌ పరిధిలోని నక్కలదిన్నెలో గురువారం అర్ధరాత్రి 12.06 నిమిషాలకు ఐదుగురికి పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్‌ లలిత లబ్ధిదారులకు డబ్బులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement